తూప్రాన్, జూలై 11: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీకి చెందిన సుమారు రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కబ్జాదారుల చెర నుంచి భూమిని కాపాడేందుకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్‌లోని పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1972లో గ్రామ పంచాయతీ ఆ భూమిని కొనుగోలు చేసిందన్నారు.
ఈ భూమి మీద కాంగ్రెస్ పార్టీ బడా నాయకుల కన్ను పడిందన్నారు. దాదాపు రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమిని కాజేయాలని కాంగ్రెస్ బడా నాయకులు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. తూప్రాన్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 1972లో ముస్లిముల నుంచి దాదాపు 1384 గజాల భూమిని అప్పటి గ్రామ పంచాయతీ పాలకవర్గం కొనుగోలు చేసిందని, 1972 నుంచి 2024 వరకు తూప్రాన్ గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉందన్నారు. సిద్దిపేట కోర్టు కూడా ప్రభుత్వ భూమిగా, తూప్రాన్ మున్సిపల్ భూమిగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, ఆ పార్టీ బడా నేతల అండదండలతో తూప్రాన్ మున్సిపల్ ప్రజల ఆస్తి అయిన రూ. 20 కోట్ల భూమిని కాజేయడానికి కొందరు కుట్ర పన్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు.
అప్పటి నుంచి ఈ భూమి కబ్జాకు జరుగుతున్న ప్రయత్నాన్ని బీఆర్ఎస్ అడ్డుకొని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాల కబ్జాను బీఆర్ఎస్ సహించదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో తూప్రాన్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఖాజామొయిజొద్దీన్, తహసీల్దార్‌తో కుమ్మక్కై కాంగ్రెస్ బడా నేతలకు కొమ్ముకాస్తూ ప్రజల ఆస్తిని కబ్జా చేయాలని చూడటం దుర్మార్గమని, దీనిపై హైకోర్టుకు వెళ్లి ప్రభుత్వ ఆస్తిని కాపాడుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదన్నారు. కబ్జాలు, గుండాయిజం, డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి నూతన మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేస్తామని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు.