గజ్వేల్, సెప్టెంబర్18: సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూటకోమాట, అబద్ధపు హామీలతో రేవంత్‌రెడ్డి కాలం గడుపుతున్నారని ఆరోపించారు. పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు గులాం చేస్తూ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అడ్రస్ లేకుండా చేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారుకు తెలంగాణలో నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
పంట రుణమాఫీ కోసం రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతాంగం నానా అగచాట్లు పడుతుంటే సచివాలయం ఎదుట విగ్రహాల పేరుతో తెలంగాణ చరిత్రను చెరిపే కుట్రకు తెరతీశాడని ఆరోపించారు. ఎనిమిది నెలల్లో రూ.80 వేల కోట్ల అప్పులు చేసి రాష్ర్టాన్ని మరింత దివాలా తీసేలా చేశారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో హంగామా చేస్తున్న రేవంత్‌రెడ్డి కారణంగా హైదరాబాద్ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల హామీలు నెరవేర్చాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకోసం బీఆర్ఎస్ తరపున మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామన్నారు.