గజ్వేల్, నవంబర్ 14: సీఎం రేవంత్‌రెడ్డి తన అల్లుడు, అన్నదమ్ములు, ఇతర కుటుంబ సభ్యుల కోసమే ఫార్మాసిటీ (ఫార్మా విలేజ్)ల ఏర్పా టు చేస్తున్నారని, దీనికోసం బలవంతంగా రైతుల నుంచి భూములు గుంజుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి అక్రమ అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రెండు రోజులు దీక్ష చేపట్టినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోలీసులతో ఆయనను అరెస్టు చేయలేదని, దీక్షకు అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు.
80 శాతం మంది రైతుల ఆమోదం ఉంటేనే భూసేకరణ చేయాలని చెప్పిన మాటలు ఆయన మరిచి పోయారన్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, గతంలో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ ఫార్మాసిటీకి భూసేకరణ చేసి దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఫార్మా పరిశ్రమలను నిలపాలని సంకల్పించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఒప్పించి 20వేల ఎకరాల భూసేకరణ చేసిందన్నారు. రైతులు, ప్రతిపక్ష నేతలపై అక్రమంగా కేసులు పెట్టి అర్ధరాత్రి రైతులను దౌర్జన్యంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. అక్రమంగా పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.