గజ్వేల్, ఫిబ్రవరి 10: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దొంగ సర్వే చేపట్టి బీసీ జనాభాను తగ్గించి చూపించి అన్యాయం చేయాలని చూస్తున్నదని, స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలుచేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసమర్థ పాలన నడుస్తున్నదని విమర్శించారు. కేంద్రం నుంచి రూపాయి నిధులు తేలేని దుస్థితితో రేవంత్ సర్కారు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు.
తెలంగాణను ధనిక రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారని, అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగానికి తీసుకెళ్లారన్నారు. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న రేవంత్‌కు ప్రజల చేతిలో భంగపాటు తప్పదన్నారు. రైతులకు వందశాతం రుణమాఫీ చేయాలని, రైతుభరోసా వెంటనే ఖాతాల్లో జమ చేయాలని, విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దివ్యాంగులకు రూ.6వేలు, నిరుద్యోగులకు రూ.4వేల భృతిని అందజేయాలన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వాలన్నారు. రైతులకు బోనస్ ఎగ్గొట్టిన దౌర్భాగ్య సీఎం రేవంత్ అని విమర్శించారు. ప్రజాపాలన దరఖాస్తులు చెత్తబుట్ట పాలయ్యాయని విమర్శించారు. మళ్లీ మీసేవ కేంద్రాల్లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవాజ్‌మీరా, మాజీ ఎంపీపీ అమరావతి, మాజీ జడ్పీటీసీ మల్లేశం, నాయకులు దయాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, గొడుగు స్వామి, బాలచంద్రం, నాగిరెడ్డి పాల్గొన్నారు.