గజ్వేల్, ఫిబ్రవరి 18: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వకుండా లక్షల ఎకరాలను వెబ్సైట్లో నుంచి మాయంచేసి బ్లాక్‌లో పెట్టిందని, దీంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన వ్యవసాయ భూములకు సైతం రైతుభరోసా ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం కోత పెట్టిందని, వెబ్సైట్లో లక్షలాది ఎకరాల సాగు భూములు కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8500 సరే నెంబర్లను బ్లాక్‌లో పెట్టి 2 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఎగ్గొట్టిందని, రైతులకు పెట్టుబడిసాయం బంద్ చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. పాత వాళ్లకు సగమే రైతుభరోసా ఇస్తూ కొత్త వాళ్లకు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి రైతులకు పూర్తిస్థాయిలో రైతుభరోసా సాయం అందించాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రులు వెంటనే దీనిపై రైతులకు సమాధానం చెప్పాలని, బ్లాక్‌లో పెట్టిన సర్వే నెంబర్లను తొలిగించి వెంటనే రైతుభరోసా సాయం జమచేసి రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.