గజ్వేల్, జనవరి 4: కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే నిధులు తెచ్చి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ఇంటి ముందు కాదు సిగ్గు, శరం, సోయి ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు ధర్నా చేసి కేసీఆర్ హయాంలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరైన రూ.200కోట్ల నిధులు తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపడితే ప్రజలు సంతోషపడతారని అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు మతిభ్రమించి ధర్నా చేశారని, రెండేండ్ల పాలనలో గజ్వేల్ ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ చేసిన అభివృద్ధి గజ్వేల్‌లో కన్పించకపోతే బీఆర్ఎస్ నాయకులు వచ్చి చూపిస్తారని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌లో అసంపూర్తి పనుల పూర్తికి నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తే నియోజకవర్గ ప్రజలు సంతోష పడతారని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ ప్రజల పక్షాన రెండు రోజులు నిరాహార దీక్ష చేసిన రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వస్తే రూ.6లక్షల పరిహారాన్ని రూ.12లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఎందుకు ముఖం చాటేస్తున్నారో చెప్పాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. నిరాహార దీక్ష చేసిన సోయి ఉంటే ముంపు గ్రామాల బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.దమ్ముంటే పెండింగ్ పనులకు రూ.500 కోట్లు మంజూరు చేయించాలన్నారు. అవసరమైతే కేసీఆర్ లెటర్ ప్యాడ్‌పై ప్రతిపాదనలు రాసిస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో గజ్వేల్‌లో రోడ్లపై బిందెలతో మహిళలు, రోడ్లపై గుంతలు, రైతు ఆత్మహత్యలు, వర్షాకాలంలో యూరియా కోసం రోడ్లపైనే రైతులు కన్పించారన్నారు.
ప్రొటోకాల్ లేని వ్యక్తులు అధికారిక కార్యక్రమంలో కూర్చోవడానికి సిగ్గుండాలని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం వర్గల్‌కు పరిశ్రమలను తీసుకొస్తే, టెంట్లు వేసుకొని అధికారంలోకి వస్తే రూ.60లక్షల పరిహారం ఇస్తామని చెప్పిన మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహా ఇప్పుడేందుకు కనిపించడం లేదని వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. పీపీటీపై అసెంబ్లీలో హరీశ్‌రావుకు అవకాశం ఇవ్వాలని, అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. సమావేశంలో గజ్వేల్ మున్సిపల్ గజ్వేల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మాజీ జడ్పీటీసీలు వెంకటేశంగౌడ్, మల్లేశం, మాజీ కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, చందు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాల రమేశ్‌గౌడ్, నాయకులు విరాసత్ అలీ, సురేశ్, గోలి సంతోష్, నర్సింగరావు, శ్రీధర్, కనకయ్య, నరేందర్ పాల్గొన్నారు.