గజ్వేల్, ఆగస్టు 29: అకాల వర్షాలకు పంట లు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభు త్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాం డ్ చేశారు. గజ్వేల్ మండలంలోని కోనాపూర్ చెరువుకు గండిపడడంతో పొలాలు నీటమునిగి రైతులకు నష్టం జరిగిందని, బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
శుక్రవారం గండిని రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కోనాపూర్ చెరువు కట్ట తెగిపోయిందన్నారు. మత్తడి నిర్మాణం చేపట్టాలని, రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, మాజీ సర్పంచ్ బాలచంద్రం, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, రైతులు మల్లేశం, సత్తయ్య, బాల్‌నర్సయ్య, రాజయ్య, నవీన్, కృష్ణ, సత్యనారాయణ ఉన్నారు.
గజ్వేల్, ఆగస్టు 29: భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, ములుగు వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. గజ్వేల్, రాయపోల్ మండలాల పరిధిలో వరి 643 ఎకరాలు, పత్తి 300పై చిలుకు ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ములుగు డివిజన్ పరిధిలోని వర్గల్ మండలంలో సుమారు 3వేల ఎకరాల్లో అత్యధికంగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ములుగు, మర్కూక్, జగదేవపూర్ మండలాల్లో మరో 1000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కురగాయల పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు.
మర్కూక్ మండలం చెబర్తి గ్రామ సమీపంలో కొండపోచమ్మ కాలువ వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గజ్వేల్ మండలం కోనాపూర్ మైసమ్మ చెరువుకు గండిపడి నీళ్లన్నీ వృథాగా పోతుండడంతో చెరువు కింద సాగుచేసిన పొలాలు దెబ్బతిన్నాయి. వర్గల్ మండలం ఖాన్చెరువులోని వర్షం నీళ్లు అధికంగా చేరడంతో పంటలు దెబ్బతిన్నాయి. జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లిలో రైతు బాలకృష్ణరెడ్డికి చెందిన పొలంలోకి నీళ్లు చేరడంతో వరి పంట దెబ్బతిన్నది. గ్రామాల్లో పర్యటిస్తూ వ్యవసాయాధికారులు పంటల నష్టం వివరాలు సేకరిస్తున్నారు.
పాపన్నపేట, ఆగస్టు 29: భారీ వర్షాలకు కారణంగా మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం ముందు మంజీరా నదిలో వరద పరవళ్లు తొక్కుతూ నిజాంసాగర్ ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తున్నది. రెండు వారాలుగా వరద ఉధృతి మూలంగా దుర్గామాత ఆలయం మూసి ఉంది. దీంతో అమ్మవారు ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా పెద్దఎత్తున వర్షాలు కురవడంతో మంజీరా నదిలో ఉధృతి మరింత పెరిగింది.
మంజీరా నదిలో వరద దుర్గామాత ఆలయ రేకులను తాకుతూ పరుగులు తీస్తున్నది. ఘనపూర్ ఆనకట్ట సైతం పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నది. మంజీరా ఉధృతి మూలంగా ఎల్లాపూర్ బ్రిడ్జి పొంగి పొర్లి మెదక్-బొడ్మట్‌పల్లి రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచి పోగా, శుక్రవారం వరద ఉధృతి తగ్గడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి అరికెల గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ తండాల రోడ్లు తెగిపోగా, శుక్రవారం అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధ్దరించారు.నిజాంసాగర్ బ్యాక్ వాటర్ తగ్గడంతో పాపన్నపేట-మిన్పూర్ మధ్య బారాఖాన రోడ్డుపై రాకపోకలను పునరుద్ధ్దరించారు.