గజ్వేల్, నవంబర్ 13: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విలువైన వక్ఫ్‌బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రతి ఏటా విలువైన వక్ఫ్‌బోర్డు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుం డా అర్థరాత్రి సమయంలో నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అన్ని తెలిసిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏటా కోట్లాది రూపాయల విలువైన భూ ములను అక్రమార్కు లు కాజేస్తున్నారు. గతంలో తమకేమీ పట్టనట్లుగా మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు ఇచ్చి చేతులు దూలుపుకున్నారు. అదే అదునుగా ప్రస్తుతం వక్ఫ్‌బోర్డులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీలో విలువైన వక్‌బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ భూములపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో హారతి కర్ఫూరంలా కరిగిపోతున్నాయి. గజ్వేల్ పట్ణణంలోని జాలిగామ బైపాస్ రోడ్డులో విలువైన వక్ఫ్‌బోర్డు భూములు ప్రతి ఏటా ఆక్రమణకు గురవడంతో పాటు అనుమతి లేని నిర్మాణాలు పదుల సంఖ్య లో వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గజ్వేల్ మండలంలోని 14గ్రామాల్లో 768.18ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా అందులో సుమారు 400ఎకరాల వరకు గజ్వేల్ పట్టణంలోనే ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని వక్ఫ్ భూముల వ్యవహారంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.
పట్టణంలోని వక్ఫ్ భూముల విలువ ఎకరాకు రూ.2కోట్లకు పైగా ఉంటుంది. ఈ లెక్కన వక్ఫ్ఆస్తుల విలువ మున్సిపాలిటీలోనే సుమారు వెయి కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పటికే ఈ భూముల్లో అత్యధికంగా నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి భూముల్లో కొన్నేండ్లుగా అత్యధికంగా నిర్మాణాలు చేపట్టారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టే పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. విలువైన భూములను కాపాడాల్సిన రెవెన్యూ, వక్ఫ్, మున్సిపల్ అధికారులు ఎక్కడా కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదని పలువురు ఆరోపిస్తుండగా ఒక్కో ఇంటి నిర్మాణంపై లక్షల్లో చేతులు మారుతున్నాయనే వాదనలు ఉన్నాయి.
వక్ఫ్‌బోర్డులో నిర్మాణాలు చేపట్టేవారు అర్ధరాత్రి సమయంలో పూర్తి చేసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందిన ఒకటి, రెండు రోజుల వరకే వాటి పై నిఘా పెడుతుండగా తర్వాత యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని జాలిగామ బైపాస్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా ఆయా శాఖల అధికారులు మాత్రం చూసీచూడనట్లు ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వక్ఫ్‌బోర్డులో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్నారు. విలువైన వక్ఫ్‌బోర్డు భూములు కాపాడాల్సిన అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలు అడ్డుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
వక్ఫ్‌బోర్డు భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా నోటిసులు అందజేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు. గజ్వేల్‌లో ఇప్పటికే చాలా వరకు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నాం.
-సాబేర్ హుస్సేన్, జిల్లా ఇన్చార్జి, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్