కొల్చారం, ఆగస్టు 19: కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సమస్యల పరిషారానికి కార్యకర్తలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు. మెదక్ జిల్లా కొల్చారంలోని బాబా ఫంక్షన్హాల్లో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో అమలైన అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయన్నారు. కల్యాణలక్ష్మి విషయంలో కోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వం పాత పథకాలను తొలిగించడం తప్పా కొత్తగా ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ రైతును రాజుగా తీర్చిదిద్దితే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె విమర్శించారు. రైతుబీమా ప్రీమియం చెల్లింపుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో ఓ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతుండగా క్షేత్రస్థాయిలో12 గంటలు కూడా సరఫరా కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో తీవ్ర విమర్శలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు సుమారు రూ.3.82 లక్షల కోట్లు ఉంటే వాటిని రూ.8 లక్షల కోట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.
బీఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ జిల్లా నేత అర్హత మర్చిపోయి ఎమ్మెల్యేపై అవాకులు చివాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి కాదని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేశ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని, దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలన్నారు. నాయకులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి యువత, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్, సీనియర్ నాయకులు నరేందర్‌రెడ్డి, అరిగే రమేశ్, సంతోష్‌కుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, సర్పంచ్‌లు గీతా రమేశ్, లక్ష్మీపెంటయ్య, వినోద్ నాయక్, నిర్మలామల్లేశం, స్వామి, మోహన్, కమిలిదేవీసింగ్, దేవీసింగ్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.