అక్కన్నపేట, జూన్ 18: వానకాలం సీజన్ ప్రారంభమైంది. దీంతో అన్నదాతలకు కాంగ్రెస్ సర్కారులో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇదే అదునుగా భావించిన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు యూరియా బస్తాలపై రూ.270తో పాటు అదనంగా రూ. 30 హమాలీ చార్జీ పేరిట వసూలు చేస్తున్నారు. దీంతో పాటు యూరియా బుకింగ్ తర్వాత షాపులో ఏదో ఒక వస్తువు (సీఎంఎస్, ఎఫ్20, లేదా ఇతర ఏదైనా ఎరువు) లింక్ చేసి అమ్ముతున్నారు. లేదంటే యూరియా బుకింగ్ చేసినప్పటికీ సర్వర్ బిజీ ఉందంటూ వెళ్లగొడుతున్నారు.
రూ.1350 ధరతో ఉన్న డీఏపీ ఎరువును బ్లాక్ చేసి వారి ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. డీఏపీ మార్కెట్లో లేదంటూ ప్రచారం చేస్తున్నారు. కావాలంటే తమ షాపుల్లో ఇతర ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు కొనాలని, దీంతో భవిష్యత్‌లో అవసరమైన వాటిని అందజేస్తామంటూ నిర్వాహకులు రైతులను నిర్మొహమాటంగా హెచ్చరిస్తున్నారు. 2020 ఎరువు బస్తా ధరను మొదట రూ.1450 నుంచి రూ.1800 తదుపరి రూ.2100 పెంచారు. ప్రస్తుతం పాత రేటులో 2020 బస్తా కావాలంటే రైతుకు ఏదో ఒకటి బలవంతంగా అంటగట్టి ఇస్తున్నారు. యూరియా బుకింగ్ తర్వాత కూడా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంటున్నదని రైతులు వాపోతున్నారు.
ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల దుకాణాలపై నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన ఏవోలు డీలర్లతో కుమ్మకై, వారికి వంత పాడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ ఫర్టిలైజర్ దుకాణంలోని యూరియాను అక్రమంగా తరలించడంలో సదరు అధికారి పాత్ర ఉన్నదనే విమర్శలున్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల నిబంధనలను తుంగలో తొక్కి మండలంలోని పలువురు డీలర్లతో సన్నిహితంగా ఉంటూనే తనకు రావాల్సిన వాటాలు తీసుకుంటున్నారని కొందరు బాహాటంగా ప్రచారం చేస్తున్నారు. సదరు అధికారి మాముళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. ఏది ఏమైనా రైతులకు ఇబ్బందులు కలుగకుండా క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, గుగులోతు శివరాజ్ కోరుతున్నారు.
అక్కన్నపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారు. రైతుల శ్రేయస్సును మరిచిపోయి డీలర్లతో కుమ్మకైన మండల వ్యవసాయాధికారిణిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. రైతుల ఇబ్బందులను పరిష్కరించకుండా సొంత లాభం కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఫీల్డ్ విజిట్ పేరిట విధులకు డుమ్మా కొడుతూ, సమయపాలన పాటించడం లేదు. కట్కూరు, పోతారం (జె), రామవరం, అక్కన్నపేట, గౌరవెల్లి, గుబ్బడి, గోవర్ధనగిరి, గండిపల్లి, కుందన్‌వానిపల్లి గ్రామాల్లోని దుకాణ యజమానులతో కలిసి దందా సాగిస్తున్నారు.
– పెసరు సాంబరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, అక్కన్నపేట