సిద్దిపేట, జూలై 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. బస్తా యూరియా కోసం రైతులు గంటల పాటు క్యూలో నిల్చుంటున్నారు. క్యూలో చెప్పులు, పాస్‌బుక్కులు పెట్టి యూరియా పొందడానికి రైతులు పాట్లు పడతున్నారు. యూరియా లారీల కోసం దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. తీరా యూరియా లారీ వచ్చాక తమ దాక వస్తదో రాదో తెలియని పరిస్థితులు రైతులకు ఎదురవుతున్నాయి. డిమాండ్‌ను ఆసరా చేసుకొని దుకాణాల యజమానులు బస్తాకు రూ. 100 వరకు అధికంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
మరికొన్ని దుకాణాల్లో యూరియా బస్తాతో పాటు ఇతర మందులు కొంటేనే యూరియా ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రెండు రోజుల కిందట సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల వద్ద రైతులు యూరియా కోసం రాస్తారోకో చేశారు. రాయపోల్ మండల కేంద్రంలో రైతులు నిరసన తెలిపారు.దౌల్తాబాద్‌లో యూరియా కోసం రైతులు భారీగా క్యూలో నిలబడ్డారు. కొందరికే యూరియా దొరకడంతో మిగతా రైతులు నిరాశకు గురయ్యారు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వానకాలం సీజన్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా భారీ వర్షాలు కురవలేదు. వచ్చి పోయే వానలకు రైతులు విత్తనాలు విత్తారు. ప్రస్తుతంలో మక్క, పత్తి, వరికి యూరియా అవసరం.మొదట్లోనే యూరియా కొరత ఉంటే పంట చివరి వరకు పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానకాలం సీజన్లో రైతులు ఎక్కువగా మక్క, పత్తి, వరి సాగుచేస్తారు. ఆ పంటలకు యూరియా అవసరం ఉంటుంది. సరిపడా యూరియాను అందించాలని రైతులు కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లాలో 3,76,000 ఎకరాల్లో వానకాలం వరి సాగు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 5,957 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారు. నారుమళ్లు సిద్ధ్దంగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో వరి నాట్లు పడితే జిల్లాలో యూరియా దొరికే అవకాశం లేదు. మక్క సాగు లక్ష్యం 22 వేల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 15,543 ఎకరాల్లో సాగైంది. పత్తి పంట సాగు లక్ష్యం 1,11,045 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 88,878 ఎకరాలు సాగు చేశారు. ప్రస్తుత సమయంలో ఈ పంటలకు యూరియా వేయాలి. కానీ, రైతులకు యూరియా అందుబాటులో లేదు. రైతులు పడిగాపులు కాస్తున్నారు.
యూరియా దుకాణాల నిర్వాహకులు ఎకరాకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగ్రో, గ్రోమార్, పీఏసీఎస్ దుకాణాల్లో రూ.280 నుంచి రూ. 290 వరకు తీసుకుంటున్నారు. ఇతర ప్రైవేట్ రూ.320 వరకు తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. యూరియా కోసం పైరవీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. యూరియా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ-పోర్టల్‌లో రైతు నమోదు చేసుకున్న తరువాతనే ఎకరాకు ఒక యూరియా బస్తా ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు
రాయపోల్, జూలై 9: కాంగ్రెస్ పాలనలో యూరియాకు తిప్పలు అవుతున్నది. వానకాలం సాగు కోసం ముందస్తుగా యూరియాను అందుబాటులో ఉంచడంలో రేవంత్ సర్కారు విఫలమైంది. పొలం పనులు వదులుకొని యూరియా కోసం ఆగ్రోస్ సెంట, ఎరువుల షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన వస్తున్నది. వర్షాలు కురుస్తున్నందున మక్కకు యూరియా వేయాలి. మాకు యూరియా దొరకడం లేదు. అధికారులు ఎరువులు అందుబాటులో ఉంచాలి
– దాసరి బాల్నర్సు, రైతు, కొత్తపల్లి, రాయపోల్ మండలం, సిద్దిపేట జిల్లా
జూలై 9: నాకు రెండెకరాల భూమి ఉన్నది. యూరియా కోసం రెండురోజుల నుంచి తిరుగుతున్న. ఏ దుకాణానికి పోయినా యూరియా లేదంటండ్రు. నిన్న వచ్చిన ఇవ్వాల్లమల్ల వచ్చిన… యూరియా ఉన్నకాడనేమో మందు బస్తాలు, పురుగు గోలీలు తీసుకుంటనే ఇత్తమని లింక్‌లు పెడుతున్నరు. గవన్నీ గిప్పుడు తీసుకపోయి ఏంసెయ్యాలే. మల్ల దొరుకతలేదని అందరు సెప్పుతండ్రు. ఇదివరకు ఎన్నడు గిట్ల కరువు గాలే పిండిబస్తాలకు గిప్పుడే గిట్ల సేత్తండ్రు.
– గుగులోతు హన్మంతు, రైతు, పూల్నాయక్ తండా, సిద్దిపేట జిల్లా
మిరుదొడ్డి, జూలై 9: కాంగ్రెస్ ప్రభు త్వం అచ్చినంక యూరియా కోసం గోస తప్పడం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గింత తిప్పలు లేకుండే. ఆటో తీసుకొని వచ్చి నేను ఏటా 24 బస్తాల యూరియా తీసుకెళ్లేటోడిని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధార్ కార్డుకు రెండు యూరియా బస్తాలు ఇస్తున్నది. గిట్లయితే ఎవుసం ఏ విధంగా చేసుకోవాలి. నేను ఏడెకరాల్ల మక్క పంట ఏసిన.
– భక్తపురం శంకర్రావు, రైతు, ఆరేపల్లి, మిరుదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా
రాయపోల్, జూలై 9 : ఈ వానకాలం మా చేనులో మక్క పంట సాగు చేశా ను. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు తీసి దంతెలు పట్టి యూరియా వేయాల్సిన సమయంలో కొరత ఏర్పడింది. నిత్యం షాపుల వద్ద యూరియా కోసం క్యూలో నిల్చుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేక ఎరువుల కొరత ఏర్పడింది.
– విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు, తిమ్మక్కపల్లి, రాయపోల్ మండలం
ఎకరంన్నర పత్తిపెట్టిన. పంట మంచిగ పెరిగింది. దానికి పిండి ఏద్దామని వత్తే ఏదుకాణం పోయినా ఇత్తలేరు. నగదు పైసలు ఇత్తమని చెప్పినా మాదగ్గర లేవ్వు అని సెప్పుతండ్రు. నిన్నకూడ గిట్లనే తిరిగిన. మందు బస్తాలకు పొద్దుగాలనే వచ్చుడైతంది. నిన్న ఎనిమిదింటికి వచ్చి ఐదుగంటలదాకా ఉన్నా పిండి బస్తాలు దొరకలే. ఇప్పుడు గూడ సూత్తన్న. పత్తిల కలుపుకూడ సేసిన. గీ మందు బత్తాల కోసం తకిలీబ్ అవుతున్నది.
-ఎర్రబోయిన కొమురవ్వ, రైతు, గొల్లపల్లి, సిద్దిపేట జిల్లా
కొమురవెల్లి, జూలై 9: తెలంగాణ వచ్చినంక కేసీఆర్ పాలనలో ఎవుసానికి మంచి రోజులు అచ్చినయి. ఎరువులకు మాకు ఢోకా లేకుండే. గిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక మళ్ల మునపటి కాలం వచ్చింది. ఎరువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వానలు సరిగ్గా పడకపోవడంతో చాలా మంది రైతులు సాగు మొదలు పెట్టలేదు. అయినా యూరియా దొరకడం లేదు. గిప్పుడే గిట్లుంటే అందరు రైతులు సాగు మొదలుపెడితే ఎట్లానో.
– తాడెం శ్రీనివాస్, రైతు, ఐనాపూర్