గజ్వేల్/తొగుట/మిరుదొడ్డి,ఆగస్టు12: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల కేంద్రం వద్ద పడిగాపులు కాశారు. యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా కేంద్రం వద్దకు పరుగులు తీశారు. భారీగా రైతులు రావడంతో పోలీసుల సమక్షంలో టోకెన్ చిట్టీలను అందజేసి రైతులకు ఆగ్రోస్ కేంద్రం వద్ద పంపిణీ చేశారు. ప్రభుత్వం సరిపడా యూరియా అందుబాటులో ఉంచడం లేదని రైతులు మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా తొగుట వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రైతులు యూరియా కోసం క్యూలో నిరీక్షించారు. గంటల పాటు లైన్లో ఉంటే ఒక పట్టా పాస్బుక్కు పైన రైతుకు రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇచ్చారు. కొందరు రైతులకు యూరియా దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు.సరిపడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులుమండిపడ్డారు.
వరి, మొక్కజొన్న పంటలకు కావాల్సిన యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందని సమాచారం అందగానే ఆయా గ్రామాల రైతులు తరలివచ్చి క్యూకట్టారు. గంటల పాటు నిలుచుంటే పట్టా పాస్బుక్కు రెండు యూరి యా బస్తాలు మాత్రమే నిర్వాహకులు ఇచ్చారు. చాలామంది రైతులకు యూరియా బస్తాలు దొరక లేదు. యూరియా దొరకని రైతులు ఆగ్రహానికి గురై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ ఉండగా గిట్ల రంది కాలేదని గుర్తుచేశారు.