సిద్దిపేట, ఆగస్టు 23: సిద్దిపేట నియోజకవర్గంలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు నిర్లక్ష్యం వీడి సరిపడా ఎరువులు సరఫరా చేయాలని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం సిద్దిపేట నియోజకవర్గంలో ఏడీ, ఏవోలు, ఏఈవోలతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. నియోజకవర్గంలో ఈ వానకాలం సీజన్లో 11,600 మెట్రిక్ టన్నులకు 4,772 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని, ఇంకా 6,878 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉందన్నారు.
రైతులు యూరియా కేంద్రాల వద్ద చెప్పులు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి క్యూలో నిలబడుతున్నారని, యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట రూరల్ మండలంలో 1900 మెట్రిక్ టన్నులు అవసరం, ఉండగా 563 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారన్నారు. చిన్నకోడూరులో 3200 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా , 930 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారని, నారాయణరావు పేట మండలంలో 1500 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా, 550 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని, నంగునూర్ మండలంలో 3200 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా, 867 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారన్నారు.
సిద్దిపేట అర్బన్ మండలంలో 1800 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారని, ఇంకా 400 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆగస్టు నెలలోనే పంట వేసి ఎరువులు వేస్తారని, ఈ సమయంలోనే యూరియా అందక రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి సిద్దిపేట నియోజకవర్గంలో కావాల్సిన ఎరువుల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వెంటనే యూరియా కొరత తీర్చాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు.
సిద్దిపేట నియోజకవర్గంలో ఆయిల్‌పామ్ సాగు పై దృష్టిపెట్టాలని, ఆయిల్‌పామ్ కోత కోసే దగ్గరికి ఆసక్తి గల రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించాలని అధికారులకు హరీశ్‌రావు ఆదేశించారు. పంట నష్టంపై, రైతుబీమా అందించడంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు.