తొగుట, ఆగస్టు 01: తొగుట మండలంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో మండల స్పెషల్ ఆఫీసర్ ఏడిఏ మల్లయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాను అందించడం జరుగుతుందని రైతులందరూ సహకరించాలన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు పంటల దశలలో మాత్రమే యూరియాను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పంటలకు ఒకే విడతలో పూర్తిగా సరిపడా యూరియాను ఒకేసారి తీసుకుపోదామని రైతులు అడగడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్నారు. యూరియాకు బదులు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వాడాలని సూచించారు. నానో యూరియా వాడడం వల్ల భూమిలో రసాయనాలు పడవని మొక్కకు అవసరం ఉన్న రసాయనాలు మాత్రమే అందుతాయని దీనివల్ల రైతులకు దిగుబడి పెరుగుతుందన్నారు. నానో యూరియాతోపాటు కలుపు మందు, చీడపురుగుల మందు పిచికారి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒకసారి నానో యూరియా వాడితే దాదాపుగా 20 నుంచి 25 రోజుల వరకు సామర్థ్యం పంటలపై ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాజేష్, సొసైటీ సీఈఓ గంగారెడ్డిలు పాల్గొన్నారు.