జహీరాబాద్, మే 10: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామబిడ్డలు దేశసేవలో తరిస్తున్నారు. ఈ గ్రామం నుంచి సుమారు వంద మంది వరకు దేశ త్రివిధ దళాల్లో పనిచేస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందిన ఈ గ్రామయువత ఆర్మీలో చేరుతున్నారు.
కమాండర్, బ్రిగేడియర్, హవాల్దార్, ఆర్మీ వైద్యాధికారులు, ఫిజికల్ ట్రైనర్, లాస్ నాయక్, నాయక్ సుబేదార్, సుబేదార్, సైనికులుగా గ్రామ యువత సేవలు అందిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, జహీరాబాద్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండలాల నుంచి మరో వందమందికి పైగా సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
దేశ సరిహద్దుల్లో కాపలాదారుడిగా పనిచేసే భాగ్యం కలగడం అదృష్టం, ఆ అదృష్టం ఎందరికో రాదు, చావు ఎప్పటికీ తప్పదు, దేశం కోసం ప్రాణాలర్పిస్తే ఆ తృప్తి వేరు అంటూ జహీరాబాద్ ప్రాంత యువత ఆర్మీలో చేరి దేశసేవలో నిమగ్నమయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. న్యాల్కల్ మండలంలోని హద్నూర్, న్యాల్కల్, తాట్పల్లి, మల్కాన్పాడ్, గుంజోట్టి, మిర్జాపూర్ (ఎన్), ఝరాసంగం మండలంలోని ఎల్గొయి, పోట్పల్లి, బర్ధీపూర్ గ్రామాలకు చెందిన యువకులు సైన్యంతో పాటు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌లోనూ జహీరాబాద్ సైనికులు పాల్గొని శత్రుదేశం పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టారు.
దేశ రక్షణకే ఈ జీవితం..
నేను సైన్యంలో చేరి ఆరేండ్లు అవుతున్నది. చిన్ననాటి నుంచే దేశసేవ చేయాలన్నదే నా లక్ష్యం. తల్లిదండ్రులు, కుటుంబీకులు, స్నేహి తుల ప్రోత్సాహంతో ఆర్మీలో చేరాను. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఉన్నతాధికారుల నుంచి పిలుపు వచ్చింది. ఆర్మీలో నేను అనేక ప్రాంతాల్లో పనిచేశాను. ఆర్మీలో ఉద్యోగం చేస్తుంటే తృప్తిగా ఉంది. – సీహెచ్ నవీన్‌కుమార్, సైనికుడు, హద్నూర్ (న్యాల్కల్ మండలం)