జహీరాబాద్, మే 14: జహీరాబాద్‌లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ మడిగెలు వేలం పాటలో దక్కించుకున్న వ్యాపారులకు అప్పగించడంలో తాత్సా రం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు అమలు కావడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రూ.11 కోట్లతో జహీరాబాద్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో 33, మొదటి అంతస్తులో 34, మొత్తం 67 షట్టర్లు నిర్మించారు. 2022 డిసెంబర్ 27న అప్పటి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను ప్రారంభించారు. 2023 ఫిబ్రవరి 8న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లో 53 షట్టర్లకు వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో డిపాజిట్ కింద రూ. 50 వేలు, సాల్వె న్సి సర్టిఫికెట్ ద్వారా రూ. 2 లక్షలు వ్యాపారులు చెల్లించారు. కానీ, షట్టర్లకు సంబంధించిన బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ వాటిని వ్యాపారులకు అప్పగించలేదు. దీంతో వేలం పాటలో పాల్గొన్న వ్యాపారులకు మడిగెలు (దుకాణాలు) కేటాయింపు నిలిచిపోయింది.
మూడేండ్లుగా వ్యాపారులు దుకాణాలు అప్పగించాలని మున్సిపల్ కార్యాల యం చుట్టూ తిరుగుతున్నా కమిషనర్, సం బంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వేలం పాటలో చెల్లించిన డబ్బులకు వడ్డీ భారం పెరిగిపోతున్నదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఇం టిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ దుకాణాలు (మడిగెలు) అప్పగించాలని వ్యాపారులు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇప్పిస్తామని మంత్రి చెప్పి, మడిగెలకు సంబంధించిన తాళాలను కాంట్రాక్టర్ నుంచి తీసుకుని అప్పటి కలెక్టర్‌కు అప్పగించారు. వెంటనే మార్కెట్ మడిగెలు వ్యాపారులకు అప్పగించి సమస్యను పరిష్కరించాలని అప్పటి కలెక్టర్‌కు మంత్రి ఆదేశించారు. కానీ, నేటికి కార్యరూపం దాల్చడం లేదు.
జహీరాబాద్ పట్టణంలో 65వ నంబర్ జాతీయ రహదారి వెంట నిర్మించిన వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌తో వ్యాపారం సాగి ఆర్థికంగా కలిసి వస్తుందని వేలం పాటలో మడిగెలు దక్కించుకున్న వ్యాపారులకు నిరాశే మిగిలింది. కొందరు వ్యాపారులు మడిగెలు (దుకాణాలు) అప్పగించక పోవడంతో మార్కె ట్ ఎదురుగా తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్డుపైనే వ్యాపారులు కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేసుకుని విక్రయిస్తుండడంతోట్రాఫిక్ సమస్యతో ప్రజలు, వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. మూడేండ్లుగా మున్సిపాలిటీ నెలకు రూ. 6 లక్షలకు పైగానే అద్దె రూపంలో ఆదాయాన్ని కోల్పోతున్నది. మంత్రి దామోదర రాజనర్పింహ, జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు సమస్య పరిష్కరించాలని వ్యాపారులు కోరుతున్నారు.