మెదక్, (నమస్తే తెలంగాణ), జహీరాబాద్/ మెదక్ మున్సిపాలిటీ/ చిలిపిచెడ్/ రాయికోడ్/ నిజాంపేట/ జగదేవపూర్/ కొల్చారం/ చిన్నశంకరంపేట, మార్చి 21: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఇండ్లు, దుకాణాలపైన ఉన్న రేకులు ఎగిరిపోయాయి. వర్షానికి వరిపంటకు కాస్త ఉపశమనం లభించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మెదక్ జిల్లా కేంద్రంలోని జంబికుంట వీధిలో పిడుగుపడి వడియారం సిద్ధయ్య అనే వ్యక్తి ఇంటి పైభాగంలోని పెంట్‌హౌస్ వెల్వేషన్ స్వల్పంగా ధ్వంసమైంది. ప్రాణ నష్టం జరగలేదు.
చిలిపిచెడ్ మండలంలో కురిసిన వర్షానికి వీధులు, రోడ్లన్నీ జలమయంగా మారాయి. కొల్చారం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. కొల్చారంలోని పలు దుకాణ సముదాయాల రేకులు ఎగిరిపోయా యి. విద్యుత్ స్తంభాలు నేలకూలగా, విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. చెట్లు సైతం రోడ్డుపై పడడంతో ఇబ్బందులు ఎదురయ్యా యి. కొల్చారం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఏడుపాయల టీ జంక్షన్ వద్ద హర్షిత రెస్టారెంట్ రేకులు ఎగిరిపోయి లోపల ఉన్న గోడలు, ఫర్నిచర్, ఏసీలు, ఇతర సామగ్రి దెబ్బతిన్నాయి. కొల్చారంలో హర్షిత రెస్టారెంట్ యజమాని రాజు గతేడాది రెస్టారెంట్ నిర్మించగా, గాలివాన బీభత్సానికి పూర్తిగా నేలమట్టమైంది. పోతంశెట్‌పల్లి చౌరస్తాలో కొన్ని రేకుల షెడ్డులు ఎగిరిపోయి 200 మీటర్ల దూరంలో పడ్డాయి. కిరాణ సామగ్రి చిందరవందరయ్యాయి.
పోతంశెట్‌పల్లి వైన్స్ సమీపంలో కరెంటు పోలు విరిగిపడి ఓ వ్యక్తికి రెండు కాళ్లు విరిగాయి. అతన్ని అంబులెన్స్‌లో మెదక్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఏడుపాయలకు వెళ్లే దారిలో రేకుల షెడ్డు అమాంతం పైకి ఎగిరి అగి ఉన్న కారుపై పడింది. అందులో ఉన్న ఇద్దరు అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. ఏడుపాయల సమీపంలో రేకుల షెడ్లు గాలిదుమారానికి ఎగిరిపోయి రోడ్డుపై వెళ్తున్న ఆటోపై పడిపోయాయి. ప్రయాణికులకు ఎలాంటి ప్రమా దం జరగలేదు. మెదక్- హైదరాబాద్ రోడ్డుపై చెట్లు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి వాగు వద్ద చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. మండలంలో గాలిదుమారంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో కోతకు వచ్చిన జొన్నపంట నేలకొరిగింది.
శనగ తదితర పంటలకు కొంతమేరకు నష్టం జరిగినట్టు రైతులు తెలిపారు. జహీరాబాద్, రాయిడ్లో ప్రాంతంలో మామిడి కాయలు నేలరాలడంతో రైతులకు నష్టం జరిగింది. జొన్న, శనగ పంటలు దెబ్బతిన్నాయి. నిజాంపేట్‌లోని కూడలిలో ప్రధాన రహదారికి ఇరుపక్కల గల పెద్దచెట్లు విరిగి రోడ్డుపై పడడంతో గంటపాటు రాకపోకలకు అంతరాయం ఎర్పడింది. రోడ్డు పక్కన ఉన్న అనిల్‌గౌడ్‌కు చెందిన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ఈదురుగాలులకు దెబ్బతింది. హోటళ్లపై వేసుకున్న పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి. నిజాంపేట్‌లో కడల రాజమణి అనే మహిళ ఇంట్లోకి వర్షంనీరు చేరింది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. తీగుల్‌నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయం వద్ద పిడుగుపాటుకి బచ్చలి యాదగిరి అనే రైతుకు చెందిన పాడిగేదె మృతిచెందింది.