దుబ్బాక టౌన్, మే 17: రైతులకు అది చేస్తాం… ఇది చేస్తాం అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్, అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు సాగదీతతో వారి కష్టం వర్షార్పణం అయ్యింది. ఆరుగాలం పండించిన పంట తమ కండ్ల ఎదుటే వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే రైతులు గుండెపగిలేలా రోదిస్తున్నారు. కొనుగోళ్ల జ్యాప్యం, మరోవైపు అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. పది రోజులుగా అమ్ముకునేందుకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవ్వడం, వెంటనే ఆరబెట్టడం, మళ్లీ వర్షం పడటం, తిరిగి ఆరబెట్టడం ఇదేతంతు దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న తీరు.
వరి పొట్టకొచ్చింది మొదలు కోసి, అమ్మే వరకు రైతులు దినదిన గండంగా కాలం వెల్లదీస్తున్నారు. అమ్ముకునేందుకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాలకు మొలకెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంటిల్లిపాది నిద్రాహారాలు మాని కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటూ ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం పరిపాటిగా మారింది. కొనుగోళ్లు వేగంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి తూకం వేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సిన దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రోజు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం, సాయంత్రానికి అకాల వర్షానికి తిరిగి ధాన్యం తడవడం జరుగతున్నదని రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. వర్షాకాలం సాగుకు సిద్ధ్దం కావాల్సిన సమయంలో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామన్నారు. ఎండకు ఎండి, వానకు తడిసి రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు.
పది రోజుల కిందటే పొలం కోసిన వెంటనే మార్కెట్ యార్డులో అమ్మేందుకు వడ్లుపోసిన. ఇప్పటి వరకు కొనలేదు. అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నాయి. వాన నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఇంటిల్లిపాది ఇక్కడే ఉండి అరబెట్టుకుంటున్నాం. ఎన్ని కవర్లు ఉన్నా సరిపోవడం లేదు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.500 బోనస్‌ను వెంటనే ఇవ్వాలి.
– విఠల్, రైతు, దుబ్బాక
సిద్దిపేట, మే 17: అకాల వర్షంతో రైతన్న ఆగమవుతున్నాడు. శుక్రవారం సిద్దిపేట పట్టణంతో పాటు పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముకుందామంటే వర్షాలు తీవ్ర కష్టానికి గురిచేస్తున్నాయి.
కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఈసారి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు. తేమశాతం, తరుగు, ఇతరత్రా కొర్రీలు పెట్టి నిర్వాహకులు కాంటాలు ఆలస్యం చేస్తున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షానికి ధాన్యం కుప్పలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి పోతుండడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇకనైనా పట్టించుకొని వేగంగా ధాన్యం సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
-తడిసిన వడ్లు కొనాలని రైతుల విజ్ఞప్తి
మా కండ్ల ముందటే వర్షానికి వడ్లు కొట్టుకుపోతున్నాయి. చాలా బాధగా ఉంది. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. పది రోజులుగా వడ్లను ఆరబెడుతున్నాం. ఒక్కసారిగా వర్షం రావడంతో తడిసి ముద్దవుతున్నాయి. వర్షానికి వడ్లు మొలకలు వస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే కొనాలి. వడ్లు అమ్మేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు తొలిగించాలి.
-దేవుని నర్సవ్వ, మహిళా రైతు, దుబ్బాక
ఆరు రోజుల కింద సిద్దిపేట వ్యవసాయ మారెట్‌కు వడ్లను తెచ్చాం. తేమశాతం రాకపోవడంతో వడ్లను ఆరబెట్టినం. నిన్న కొనుగోలుకు టోకెన్ ఇచ్చి బస్తాలు ఇచ్చారు. నిన్న సాయం త్రం వర్షం పడడంతో కొనుగోలు జరుపలేదు. నిన్నటి వర్షానికి వడ్లు నానిపోయాయి. ఈరోజు ఆరబెట్టినం. ప్రభుత్వం తడిసిన వడ్లను కొనాలి.
– దరిపల్లి ఎల్లయ్య, రైతు, సిద్దిపేట