మెదక్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో అకాలవర్షంతో భారీ నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానతో జిల్లావ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ పంటలు నేలకొరిగాయి. జిల్లాలోని మెదక్, హవేళీఘనపూర్, చిన్నశంకరంపేట, చేగుంట, పాపన్నపేట, టేక్మాల్, కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్, వెల్దుర్తి, శివ్వంపేట, నర్సాపూర్, నిజాంపేట, రామాయంపేట తదితర మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చే సమయంలో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. రైతులు కన్నీరు కారుస్తున్నారు. వందల ఎకరాల్లో మామిడి తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. చెట్లు నేలకొరిగాయి.
అత్యధికంగా వరి పైరుకే దెబ్బ..
మెదక్ జిల్లాలో అత్యధికంగా వరి పంట దెబ్బతిన్నది. వరి కోతకొచ్చే సమయంలోనే అకాల వర్షాలు కురయడంతో రైతులు ఈ పంటను కాపాడుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో 9966 మంది రైతులకు చెందిన 13,858 ఎకరాల్లో వరి, మామిడి పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో 9857 మంది రైతులకు సంబంధించి వరి పంట 13,632 ఎకరాలు కాగా, మామిడి 86 మంది రైతులకు చెందిన 204 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. చిన్నశంకరంపేటలో 439 ఎకరాలు, కొల్చారంలో 423 ఎకరాలు, చిలిపిచెడ్‌లో 358 ఎకరాలు, నిజాంపేటలో 575 ఎకరాలు, హవేళీఘనపూర్‌లో 784 ఎకరాలు, చేగుంటలో 3400 ఎకరాలు, రామాయంపేటలో 1339 ఎకరాలు, నార్సింగిలో 1065 ఎకరాలు, పాపన్నపేటలో 3891 ఎకరాలు, కౌడిపల్లిలో 444 ఎకరాలు, పెద్దశంకరంపేటలో 19 ఎకరాలు, వెల్దుర్తిలో 496 ఎకరాలు, నర్సాపూర్‌లో 319 ఎకరాలు, మాసాయిపేట మండలంలో 80 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. 204 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. ఇందులో చిన్నశంకరంపేట మండలంలో 49.36 ఎకరాలు, నిజాంపేటలో 39 ఎకరాలు, నార్సింగిలో 11, కౌడిపల్లిలో 87 ఎకరాలు, వెల్దుర్తిలో 18 ఎకరాల్లో మామిడి పంటలు దెబ్బతిని మామిడి కాయలు నేలకొరిగాయి.
ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది..
– ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మంగళవారం రాత్రి కురిన వర్షంతో దెబ్బతిన్న వరి పంటలను బుధవారం మెదక్ నియోజకవర్గంలోని హవేళీఘనపూర్ మండలం కూచన్‌పల్లి, పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ గ్రామాల్లో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులను ఆమె ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు.
మెదక్ జిల్లాలో 672 మి.మీ వర్ష పాతం నమోదు..
మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సరాసరి 672.6 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చేగుంట మండలంలో 59.7 మి.మీ, నిజాంపేటలో 54.2 మి.మీ, మాసాయిపేటలో 54.6 మి.మీ, చిన్నశంకరంపేటలో 49.4 మి.మీ, నర్సాపూర్‌లో 48.3 మి.మీ, హవేళీఘనపూర్‌లో 41.2 మి.మీ, మెదక్‌లో 40.3 మి.మీ, పాపన్నపేటలో 39.7 మి.మీ, టేక్మాల్‌లో 34.9 మి.మీ, కొల్చారంలో 26.4 మి.మీ, శివ్వంపేటలో 20 మి.మీ, వెల్దుర్థి మండలంలో 28.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మనోహరాబాద్ మండలంలో 14 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.