సిద్దిపేట, మే 22( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. పలుచోట్ల చెట్లు విరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులకు నష్టం జరిగింది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను కలిసి వారి బాధలు తెలుసుకున్న పాపాన పోలేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం రైతులను ఓదార్చడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, ఇతర ముఖ్య నాయకులు పర్యటనలు చేసి రైతులకు ధైర్యం కల్పించారు.
మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు…
ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. పది రోజులు అయితే వానకాలం సాగు పనులు ప్రారంభమవుతాయి. రోజుల తరబడి ధాన్యం కేంద్రాల్లోనే రైతులు ఉండాల్సి వస్తుండడంతో వానకాలం దుక్కులు సిద్ధం చేసుకునే పనులు చేసుకోలేక పోతున్నారు.
సిద్దిపేట జిల్లాలో…
సిద్దిపేట జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. వీటిలో ఇప్పటి వరకు 28 కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసి మూసి వేశారు. దొడ్డు రకం వడ్లు ఇప్పటి వర కు 2,93,507 మెట్రిక్ టన్నులు 64,712 మంది రైతుల నుంచి కొన్నారు. రూ.540 కోట్లు రైతులకు చెల్లించారు. ఇంకా రూ. 140 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. సన్న రకం వడ్లు 6,386 మెట్రిక్ టన్నులు ఉంది. 1,063 రైతుల నుంచి కొనుగోలు చేశారు. రూ. 9.22 కోట్లు చెల్లించారు. మరో రూ. 5.60 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో 92 కేంద్రాల ద్వారా 43019 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం 10,295 మంది రైతుల నుంచి కొన్నారు. ఇప్పటి వరకు రూ. 76.33 కోట్లు 5,664 మంది రైతులకు చెల్లించారు. 4,631 మంది రైతులకు రూ. 23.47 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దొడ్డు రకం వడ్ల్ల కొనుగోలుకు 406 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 120 సెంటర్లు మూసివేశారు. 2,02,350 మెట్రిక్ టన్నుల ధాన్యం 47,935 మంది రైతుల వద్ద కొన్నారు. రూ. 312 కోట్లు 35,415 మంది రైతులకు చెల్లించారు. మరో రూ. 157 కోట్లు చెల్లించాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో 1,00,393 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కొన్నారు. దీంట్లో 73,965 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి 14,005 మంది రైతులకు రూ. 171. 60 కోట్లు చెల్లించారు. సన్నరకం ధాన్యం 4,851 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. దీని విలువ రూ. 2.43 కోట్లు, 529 మంది రైతులకు రూ. 1.72 కోట్లు చెల్లించారు.