సంగారెడ్డి, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా లో పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేలా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీని ఏర్పాటుకు కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నది. జహీరాబాద్‌లో ఇది వరకే జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్) ఏర్పాటు కాగా, నిమ్జ్‌లో పరిశ్రమల స్థాపన ప్రారంభమైంది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. రూ.2361 కోట్లతో 3,245 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నది.
తద్వారా 1.74 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో లక్ష మందికిపైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని, రూ.10వేల కోట్ల పెట్టుబడులు తరలివస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలు, అన్ని మౌలిక వసతులతో దీని ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పూర్తయితే ఇందులో ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెషినరీ, మెటల్స్, నాన్‌మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
ఫుడ్‌ప్రాసెసింగ్, రవాణా రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. పరిశ్రమ ల ఏర్పాటుతో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు యాన్సిలరీ యూనిట్స్ ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జహీరాబాద్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జహీరాబాద్‌లో ఏర్పాటు చేసే స్మార్ట్‌సిటీ హైదరాబాద్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 65వ నెంబరు జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరం, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జహీరాబాద్ రైల్వేలైన్ 19 కిలోమీటర్లు, మెటల్‌కుంట రైల్వేస్టేషన్ 12 కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు కానున్నది.
పరిశ్రమలకు అవసరమైన గ్యాస్ పైప్‌లైన్ సైతం 30కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉంది. నిమ్జ్ సమీపంలోనే ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయనున్న పక్షంలో భూసేకరణ సులభతరం కానుంది. నిమ్జ్కోసం ప్రభుత్వం జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో 3వేల ఎకరాలకుపైగా భూ మి సేకరించింది. నిమ్జ్లోనే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు చేసిన పక్షంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు సమస్య తొలగనున్నది. అలా కాకుండా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు చేసిన పక్షంలో జహీరాబాద్, న్యాల్కల్ మండలాల్లో అదనంగా భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుతో సంగారెడ్డి జిల్లాతోపాటు జహీరాబాద్‌లో పారిశ్రామిక రంగానికి ఊతం లభించనున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇది వరకే పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలో మహీంద్రాతోపాటు ఆటోమొబైల్ పరిశ్రమలు ఉన్నాయి. నిమ్జ్‌లో భాగంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు ప్రకటన చేయడంతో ఈ ప్రాంతానికి మరిన్ని కొత్త పరిశ్రమలు తరలిరానున్నాయి.