గజ్వేల్ రూరల్, మార్చి 5: ‘గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా మారిందని, ఎక్కడ చూసినా పంట పొలాలు దర్శనమిస్తున్నాయని, కాళేశ్వరం జలాల ద్వారా నేడు లక్షలాది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని రిమ్మనగూడలోని ప్రైవేట్ హోటల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన యాదవ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ యాదవులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, గతంలో ఎవరూ అసెంబ్లీలో యాదవుల గురించి మాట్లాడిన సందర్భాలు లేవన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో యాదవులకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. నేడు కాళేశ్వరం, మిడ్‌మానేరు, కొండపోచమ్మ సాగర్ప్రాజెక్టులు నిర్మించి రైతులకు న్యాయం చేయడంతో లక్షలాది ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయన్నారు. కండ్ల ముందు ఇంత అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 68ఏండ్లలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధ్దిని కండ్ల ముందు చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
ఉచితంగా 24 గంటల కరెంట్, ఎండాకాలం వచ్చిందంటే తాగునీటి కోసం ఎన్నో తిప్పలు పడేవాళ్లం కానీ నేడు అన్ని సమస్యలకు పరిష్కారం చూపించి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, మహిళలకు కల్యాణలక్ష్మి వంటి పథకాలు అందించి ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. యాదవుల చరిత్ర చాలా గొప్పదని, ఉదయం తిరుమల తిరుపతి దేవాలయం తెరిచే అవకాశం వంశపార పరంగా యాదవులకు దక్క డం అదృష్టంగా భావించాలన్నారు. నేడు రాష్ట్ర పండుగగా సదర్‌ను జరుపుకొంటున్నామన్నారు.
గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా ఎక్కడా లేని విధంగా రూ.11వేల కోట్లతో 75శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే కొమురవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ మట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం గా పనిచేస్తున్నారని, యాదవుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించి గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ యాదవులకు తగిన గుర్తింపు ఇచ్చారన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, కార్పొరేషన్ చైర్మన్ బాల్‌రాజు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, యాదవ, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నాగరాజుయాదవ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు సత్యనారాయణ, భాస్కర్‌యాదవ్, మల్లేశంయాదవ్, ఓదెల్యాదవ్, ఎంపీపీ కిషన్రేణుక, బండ నర్సయ్య యాదవ్, గీతాంజలి పాల్గొన్నారు.