అడుగంటుతున్న భూగర్భ జలాలు ఓవైపు.. అక్రటిత విద్యుత్ కోతలు మరోవైపు. కాలుతున్న మోటర్లు, స్టార్టర్ల్లు ఇంకోవైపు… వెరసి నీళ్లందక పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ సమస్యలు అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా కరెంట్ కోతలు విధిస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు,చిన్న వ్యాపారులు, విద్యార్థులు విద్యుత్ కోతలతో చాలా ఇబ్బందిపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం సర్వసాధారణంగా మారింది. కొన్ని గ్రామాల్లో రాత్రి గంటల తరబడి కరెంట్ ఉండడం లేదు. విద్యుత్ సరఫరా సరిగ్గా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్డింగ్ షాపులు, మిల్లులు, చిన్న పరిశ్రమలకు కరెంట్ లేక పనులు దందాలు ఆగమవుతున్నాయి. విద్యార్థులు రాత్రి సమయంలో చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోడ్ పెరగడం, సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతున్నదని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.
సిద్దిపేట, మార్చి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కరెంట్ కోతలతో పంటపొలాలు ఎండిపోతున్నాయి. కరెంట్ కష్టాలతో రాత్రి రైతులకు కునుకు కరువైంది. కరెంట్ కోసం రాత్రంతా పొలం దగ్గర జాగారం కాయాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. మడికి మడికి పైపుల ద్వారా నీళ్లు పట్టాల్సి వస్తుందని, వచ్చిపోయే కరెంట్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన కరెంట్‌తో రైతులు హ్యాపీగా పంటలు సాగుచేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు సాగు నుంచి పంటకోతకు వచ్చి అమ్ముకునే వరకు ఇబ్బందులే ఎదరవుతున్నాయి. జిల్లా మంత్రులు సైతం కరెంట్ సరఫరాపై రివ్యూ నిర్వహించడం లేదు. కాంగ్రెస్ 27 నెలల పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిత్యం వందల కొద్ది వ్యవసాయబోరు మోటర్లు కాలిపోతున్నాయి. లోవోల్జేజీ సమస్యతో తరుచూ మోటర్లు కాలడంతో రైతులు దిగులు చెందుతున్నారు. యాసంగి సాగు ప్రారంభమైనప్పటి నుంచి సరాసరి ఒక్కో రైతు రెండు మూడుసార్లు వ్యవసాయ బావి మోటర్లు కాలిపోయాయి. మోటరు కాలిన ప్రతిసారి రూ. 5 వేల నుంచి 6 వేల వరకు ఖర్చు వస్తున్నది. అధికారులు కరెంట్ కోతలు లేవంటూనే ఇష్టారీతిగా కరెంట్ కట్ చేస్తున్నారు. వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్ మీద ఫ్యూజుపోయినా సంబంధిత లైన్ ఇన్స్పెక్టర్, ఇతర సిబ్బంది పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రైతులే ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద స్టార్టర్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేశారు. గతేడాది ప్రస్తుత ఏడాదికి చూసుకుంటే ఆశించిన స్థాయిలో వరిపొలాలు లేవు. ఇటీవల కురిసిన వడగండ్లకు పొట్ట దశలో ఉన్న వరిపైరు దెబ్బతిన్నది. పంటపొలాలు ఎండిపోవడంతో రైతులు పశువులను మేపుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలో విద్యుత్ సరఫరా కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 18 లక్షలకు పైగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 1,83,530, గృహ 3,73,346, పరిశ్రమలు 3,850, మిగతా 45,202 ఇతర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ బావుల విద్యుత్ కనెక్షన్లు 1,15,152, గృహ విద్యుత్ కనెక్షన్లు 2,40,174, పరిశ్రమలు 2,411 కాగా ఇతర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 6,30,652, వాణిజ్య 77,938, పరిశ్రమలు 5,750, వ్యవసాయం 1,10,061, ఇతర 17,427 కనెక్షన్లు ఉన్నాయి.
కొమురవెల్లి, మార్చి 27 : గ్రామ శివారులో మూడు ఎకరాల భూమి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు. ఎకరంన్నరలో పంటసాగు చేశా. ఆ సగం పంట కాపాడుకోవడం కోసం మళ్లీ పాతరోజులు వచ్చాయనిపిస్తుంది. రాత్రి ఒంటి గంటకు కరెంట్ ఇస్తుర్రు. గట్ల ఇచ్చిన కరెంట్ గంటకు రెండుసార్లు ట్రిప్ అవుతుంది. అసలే పొట్ట దశకు వరి పంట వచ్చింది. నీళ్లు ఎక్కువగా లేకుంటే పంటదిగుబడి సరిగ్గా రాదు. పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే దాకా నమ్మకం లేదు.
– బండారి యాదగిరి, రైతు, గురువన్నపేట (సిద్దిపేట జిల్లా )
గ్రామంలో కరెంట్ సరిగ్గా ఉండడం లేదు. పది ఎకరాల భూమిలో పలు రకాల పంటలు సాగుచేశా. ఉదయం నాలుగు గంటలకు త్రీఫేజ్ కరెంట్ వస్తున్నది. ఆ సమయంలో బాయికాడికి పోవడం ఇబ్బందిగా మారింది. పంటలకు నీరు ఎలా పెట్టాలి. కరెంట్ సరిగ్గా రాక రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అధికారులు స్పందించి విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలి .
– నర్సింహులు,రైతు, ఖానాపూర్, కోహీర్ మండలం (సంగారెడ్డి జిల్లా)
మిరుదొడ్డి, మార్చి 27: యాసంగిలో ఎకరం పొలం, ఎకరం మొక్క జొన్న పంట సాగుచేశా. మొక్కజొన్న పంట నీళ్లు అందక ఎండిపోయింది. గొర్రెలు, మేకలు మేసిపోయాయి, అర ఎకరం వరి పొలం నీళ్లు అందక నెర్రెలు పట్టింది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కరెంట్ సక్రమంగా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు మళ్ల్లీ మొదలయ్యాయి. వరి, మొక్క జొన్న పంటలు ఎండిపోయాయి. యాసంగి సీజన్లో రూ.లక్షా 50 వేల వరకు నష్టం జరిగింది. కరెంట్ సక్రమంగా వస్తే అప్పులయ్యేవి కావు. ప్రభుత్వం సక్రమంగా కరెంట్ సరఫరా చేయాలి.
– నర్మాల ఆంజనేయులు, రైతు, మిరుదొడ్డి (సిద్దిపేట జిల్లా)
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యుత్ కోతలు పెరిగాయి.బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రెప్పపాటున కరెంట్ పోలేదు. అసలు ఈ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తున్నది. రోజూ ఆరు నుంచి ఎనిమిది సార్లు కరెంట్ పోతున్నది. రైతులపై ప్రభుత్వం కపటప్రేమ చూపెడుతున్నది. విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముందే వేసవి కాలం ఇలా కరెంట్ కోతలు ఎక్కువగా ఉంటే గ్రామల్లో తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– అరవింద్‌రెడ్డి, రైతు, గారాకుర్తి (సంగారెడ్డి జిల్లా )
రోజు మొత్తం కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉన్నది. కరెంట్‌లేక పోతే ఎలాంటి పనులు కూడా చెయ్యలేని రోజులు ఇవి. ప్రభుత్వం రైతులను మస్తు ఇబ్బందులు పెడుతున్నది. కేసీఆర్ సారు హయాంలో కరెంట్ తిప్పలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు అధికమయ్యాయి. పంటలు ఎండపెట్టుకునే పరిస్థితి వచ్చింది.
– బుచ్చయ్య, రైతు, తొగర్పల్లి (సంగారెడ్డి జిల్లా)
ఇచ్చే కరెంట్ సక్రమంగా ఇవ్వాలి. అర్ధరాత్రి విద్యుత్ సరఫరా చేస్తే బావుల దగ్గరకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా అమలుకావడం లేదు. కేసీఆర్ హయాంలో వ్యవసాయరంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేయించారు. కొండపొచమ్మ సాగర్పుణ్యమా అని పంటలు పండుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. రేపు ఎట్లుంటదో తెల్వదు. కరెంట్ సక్రమంగా సరఫరా చేయాలి.
– బూర్గుపల్లి పోషయ్య, రైతు, మైలారం, వర్గల్ మండలం (సిద్దిపేట జిల్లా)
యాసంగిలో రైతుల బతుకు ఆగమైంది. కాలం చూస్తే గిట్లుంది, కాంగ్రెస్ సర్కార్‌ను చూస్తే గట్లుంది. రైతుల బాధలు, సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు. వచ్చిపోయే కరెంట్‌తో పొలం మొదటిమడే పారుతుంది. లోవోల్టేజీ కరెంట్‌తో మోటర్లు కాలిపోతున్నాయి. కరెంటోళ్లు కూడా చేతులెత్తేశారు. బొరు, బావులు అడుగంటిపోయాయి. వరి పంటలు ఎండిపోతున్నాయి. అడ్డగొలుగా పెట్టబడి అయ్యింది. సర్కారు రూపాయి సాయం చేయలేదు. మొన్నటి భారీ ఈదురుగాలులకు పొట్టదశలో ఉన్న పొలం మొత్తం తాలు అయిపోయింది.
– వల్లపు రాములు, రైతు, అక్కన్నపేట (సిద్దిపేట జిల్లా)
జగదేవపూర్, మార్చి 27: ప్రభుత్వం 24గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా 13గంటలు కూడా వస్తలేదు. ఎండలకు పొలాల్లో నీళ్లు ఉంటలేవు. భూగర్భజలాలు తగ్గాయి. పంటలు చేతికొచ్చే దశలో కరెంట్ సరిగ్గాలేక ఎండిపోతున్నాయి. ఇచ్చిన కరెంట్‌లో కోతలు పెడుతున్నారు. మోటర్లు సరిగ్గా నడవక నీళ్లు పారిన దగ్గరే పారుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ ఇచ్చినట్లు 24గంటలు సరఫరా చేయాలి.
– గుడిసె సాయిలు, రైతు, చాట్లపల్లి (సిద్దిపేట జిల్లా)