నారాయణఖేడ్, జూలై 22: తల్లి వార్డెన్‌గా పనిచేస్తున్న వసతి గృహంలో ఓ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ వికృత చేష్టలు వెలుగుచూశాయి. మద్యం తాగి వసతి గృహానికి వెళ్లి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీనిని వార్డెన్ చూసీచూడనట్లు వ్యవహరించారు. విసిగిపోయిన బాలికలు బిక్కుబిక్కుమంటూ పోలీస్‌స్టేషన్ మెట్లెక్కి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని బీసీ బాలికల వసతి గృహంలో కొన్ని రోజులుగా సాగుతున్న ఉదంతం విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగు చూసింది. బాధిత విద్యార్థినుల వివరాల ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
50 మంది విద్యార్థినులు ఉంటున్న వసతి గృహం వార్డెన్ శారద కుమారుడైన రాజేశ్ 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్. అతను కొన్ని రోజులుగా తరుచూ మద్యం సేవించి హాస్టల్‌కు వచ్చి ఒక్కో విద్యార్థిని కింది అంతస్తులోకి పిలిచి వారి వ్యక్తిగత విషయాలు అడుగుతూ, వారిపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని వార్డెన్ సహా సిబ్బందికి తెలిపినా పట్టించుకోకపోగా, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థినులు వాపోయారు.
వార్డెన్ హాస్టల్లో అందుబాటులో ఉండక పోవడమే కాకుండా భోజనం సరిగ్గా పెట్టడం లేదని తెలిపారు. సిబ్బంది తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని విద్యార్థులు వాపోయారు. తాము ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి వచ్చి ఈ వసతి గృహంలో ఉంటూ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ చదువుతున్నామని, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న తమను వేధింపులకు గురిచేస్తే దిక్కేవరని విద్యార్థినులు రోదించారు.
తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాల ఆందోళన
నారాయణఖేడ్‌లోని బీసీ బాలికల వసతి గృహంలో జరుగుతున్న తంతంగంపై విద్యార్థినుల తల్లిదండ్రులు, ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు మంగళవారం వసతి గృహానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. బాధ్యులైన వార్డెన్, ఆమె కొడుకు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చే వరకు కదిలేదిలేదని హాస్టల్ ఎదుట బైఠాయించారు. దీంతో ఎస్సై విద్యాచరణ్‌రెడ్డి అక్కడికి చేరుకుని వారిని సముదాయించి శాంతింపజేశారు.
వార్డెన్‌పై బదిలీ వేటు
నారాయణఖేడ్‌లోని బీసీ బాలికల వసతి గృహంలో చోటు చేసుకున్న ఘటనపై వార్డెన్‌ను బదిలీ చేయడంతో పాటు ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలిగిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్ తెలిపారు. బీసీ బాలికల వసతి గృహంలో చోటు చేసుకున్న ఘటనపై ఆయన మంగళవారం వసతి గృహాన్ని సందర్శించి విచారణ జరిపారు. అనంతరం మాట్లాడారు. వసతి గృహంలోని విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిచ్చిన వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థినులకు పోలీసుల సహకారంతో భద్రత కల్పిస్తామన్నారు. హాస్టల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఏఎస్ డబ్ల్ల్యూవో భాగ్యలక్ష్మి ఉన్నారు.
పోక్సో కేసు నమోదు
‘ఖేడ్’ బీసీ బాలికల వసతి గృహంలో చోటు చేసుకున్న ఘటనపై నలుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై విద్యాచరణ్‌రెడ్డి తెలిపారు. ఏఎస్‌డబ్ల్యూవో భాగ్యలక్ష్మి, ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్డెన్ శారద, ఆమె కుమారుడు రాజేశ్, ఔట్సోర్సింగ్ సిబ్బంది లక్ష్మి, శాంతాబాయిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళలు బాలికలకు భద్రత కల్పించడం కోసమే షీటీమ్‌లను ఏర్పాటు చేశామని, భద్రత విషయంలో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండి షీటీమ్‌కు సమాచారం అందిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సూచించారు.
వార్డెన్ కొడుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు..
మా కూతురు నారాయణఖేడ్ బీసీ బాలికల వసతి గృహంలో ఉండి డిప్లొమా చదువుకుంటున్నది. వార్డెన్ కొడుకు హాస్టల్‌కు వచ్చి పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఇక్కడి పిల్లలు చెప్పడంతో మేము హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులతో కలిసి ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చాము. వార్డెన్, సిబ్బంది పిల్లలను అసభ్యకరంగా దూషిస్తున్నారనే విషయం కూడా పిల్లలు చెప్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
– మహేందర్‌గౌడ్, రామాయంపేట (విద్యార్థిని తండ్రి)