కల్హేర్, ఏప్రిల్ 1: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని కొత్త చెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ హరిసింగ్(50) హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు కంగ్టి సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉగాది పండుగ రోజు రాత్రి హరిసింగ్ చనిపోయారు. ఆయన్ను హత్య చేశారా లేదా సాధారణ మరణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కొన్ని ఆధారాలను సేకరించి పోమ్యానాయక్ తండాకు చెందిన సీతారామ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, కొత్త చెరువు తండాకు చెందిన గణపతి పేరు బయట పడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
మృతుడి భార్య పిప్లిబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిని అరెస్టు చేసి నారాయణఖేడ్‌లోని మున్సిఫ్ కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ తెలిపారు. కాగా, విస్తావత్ హరిసింగ్ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. విస్లావత్ హరిసింగ్ బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేసేవాడు. పార్టీ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఎవరూ విమర్శించినా దీటుగా సమాధానం చెప్పేవాడు. హత్యకు గురైన రోజు ఆదివారం ఉదయం కల్హేర్‌లో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో పాటు అంబలి కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొని మళ్లీ కేసీఆర్ వస్తాడు, అప్పుడు మంచిరోజులు వస్తాయని అందరితో చెప్పాడు.