వెల్దుర్తి, మే 15: ఎండలకు తాళలేక క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని రామంతాపూర్ గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. చేగుంట పోలీసుల వివరాల ప్రకారం.. మాసాయిపేటకు చెందిన నాగోల్ల భాను(16), జాల నందకిశోర్(17), మరో బాలుడితో కలిసి రామంతాపూర్ శివారులోని పలుగురాళ్ల క్వారీ గుంతలో ఉన్న నీటిలో స్నానం చేయడానికి వెళ్లారు.
వెంట వచ్చిన మరో బాలుడు గ్రామానికి తిరిగి వెళ్లగా.. భాను, నందకిశోర్ స్నానానికి వెళ్లారు. గ్రామానికి వెళ్లిన బాలుడు వచ్చి చూడగా స్నానానికి వెళ్లిన ఇద్దరు కనిపించకపోవడం, గట్టుపై వారి బట్టలు, చెప్పులు ఉండడంతో కుటుంబీకులు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి వెళ్లి అధికారులకు సమాచారం అందించగా, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, చేగుంట పోలీసులు, గత ఈతగాళ్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట పోలీసులు తెలిపారు.