చిన్నకోడూరు, ఏప్రిల్ 11: రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం, వడగండ్లు, ఈదురుగాలల దాటికి పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో వడగండ్లకు నష్టపోయిన పంటలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అకాల వర్షం, రాళ్లవానతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రైతులను ఆదుకోవడానికి సీఎం ఆదేశించారని, పంట నష్టం వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచ నా వేశామని, ఇందులో సిద్దిపేట జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు.
నష్టపోయిన రైతులను ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తుమ్మల తెలిపారు. కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ.. జిల్లాలో 9300 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. వాటిలో 6400 ఎకరాల్లో వరి, 1200 ఎకరాల్లో మామిడి, 1600 ఎకరాల్లో కూరగాయల పంటకు నష్టం జరిగిందని వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు. నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇస్తామని తెలిపారు.