మెదక్ అర్బన్, ఆగస్టు 9 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రైవేట్‌కు దీటుగా ఆర్టీసీ లాభాల బాటలో పయాణిస్తున్నది. ఆర్టీసీ సంస్థ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని వారి అవసరాలకు తగ్గట్టుగా పలు పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రయాణికులకు తిపి కబురు చెప్పింది. ఈ నెల 15న పుట్టిన చిన్నారులందరికీ 12 ఏండ్ల వరకు అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకున్నది. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
75 ఏండ్లు దాటిన వృద్ధుల కోసం 15 నుంచి 21 వరకు తార్నాక ఆర్టీసీ దవాఖానలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా ఆర్టీసీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. దవాఖానలో వైద్య పరీక్షలు చేసుకున్న వారికి ఉచితంగా మందులు అందజేయనున్నారు. ఈ అవకాశాన్ని 75 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 75 సంవత్సరాల లోపు వృద్ధులు దవాఖానలో రూ.750లకే వైద్య పరీక్షల ప్యాకేజీని కల్పించింది. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చు. వైద్య పరీక్షలు చేసుకున్న వారికి మందులపై 75 శాతం రాయితీని కల్పిస్తున్నది. కార్గో బస్సుల్లో కేజీ లోపు బరువు ఉన్న పార్సిళ్లనను 75 కి.మీల వరకు 15న ఉచితంగా ఆయా గమ్యస్థానాలకు రవాణా చేయనున్నది. తిరుమలకు వెళ్లే భక్తులకు కూడా రాయితీని కల్పించింది. 15 నుంచి 21 వరకు తిరుమలకు వెళ్లే అన్ని ప్రయాణికులకు టికెట్‌పై రూ.75 రాయితీ కల్పిస్తున్నది.
భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఎన్నడూ లేని విధంగా వరాలు కురుపిస్తున్నది. ప్రైవేట్‌కు దీటుగా పథకాలను ప్రవేశపెడుతూ ప్రయాణికుల ఆదరాభిమానాలు, మన్ననలు పొందుతున్నది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్టీసీ డిపోల్లో జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. 13 నుంచి 15 వరకు అన్ని బస్సుల్లో జాతీయ పతాకం రెపరెపలానున్నది. ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా అమృతోత్సవ్ బ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నారు.
ఆర్టీసీ ప్రయాణికులకు సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న వృద్ధులకు ఉచిత ప్రయాణం, ఆర్టీసీ దవాఖానల్లో ఉచిత వైద్య పరీక్షలు చేసుకునేలా సంస్థ చర్యలు తీసుకుంది. ప్రైవేట్‌కు దీటుగా ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల కోసం పలు పథకాలను ప్రవేశపెడుతుంది. ప్ర యాణికుల ఆనందమే ఆర్టీసీ సంస్థ లక్ష్యం.
-రవిచందర్, మెదక్ ఆర్టీసీ డీఎం