పటాన్చెరు, మే 2: పటాన్చెరు బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కష్టాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సులతో హైదరాబాద్‌కు చెందిన వేలాది సిటీ బస్సులు ఈ బస్టాండ్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. పటాన్చెరు బస్టాండ్ పరిసరాలు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుంటుంది. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు పటాన్చెరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైదరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. పటాన్చెరు ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆటోలు, ప్రైవేట్ వాహనాలు నిలుపుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ముందు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటున్నది.
బస్టాండ్ లోనికి వెళ్లేందుకు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నది. బస్టాండ్‌లో బస్సుల కోసం వేచి ఉంటున్న ప్రయాణికులకు సరైన కుర్చీలు లేక నిలిచి ఉంటున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. పటాన్చెరు బస్టాండ్‌లో ఉన్న వాహనాల పార్కింగ్ నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బైక్‌కు గంటకు రూ. 5 వసూలు చేయాలి. కానీ, నిర్వాహకులు గంటకు రూ. 10 వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు ప్రశ్నిస్తే వారితో దురుసుగా ప్రవరిస్తున్నారు.
పటాన్చెరు ఆర్టీసీ బస్టాండ్ ముందు జాతీయ రహదానిపై ట్రాఫిక్ సమస్య వేధిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ప్రతి రోజు బస్టాండ్ ముందు ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించినా, వారు ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడం లేదు. కేవలం వాహనాలకు ఫైన్లు రాయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బస్టాండ్ ముందు వాహనాలు నిలిచిపోయినా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం లేదు. రోడ్డుపై నుంచి వెళ్లున్న వాహనాలను నిలిపి నిబంధనల పేరుతో చలానా రాస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యను పర్యవేక్షణ చేసేందుకు ఎస్సై స్థాయి అధికారి లేకపోవడంతో హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. బస్టాండ్ లోపలికి వెళ్లకుండా వాహనాలు రోడ్డుపైన అడ్డంగా నిలిపినా చర్యలు తీసుకోవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్ ముందు తనిఖీలు చేస్తుండడంతో భారీగా వాహనాలు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్టాండ్‌లోకి, బయటకు వచ్చే రోడ్డు ముందు ఆటోలు, ప్రైవేట్ వాహనాలు నిలిపినా చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని సార్లు బస్టాండ్ నుంచి బయటకు వచ్చే బస్సులు నిలిచిపోతున్నాయి.