మెదక్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా షాపుల ఎదుట వాహనాలు ఇష్టారాజ్యంగా నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, చర్చి ఎదుట ఉన్న హోటల్ నిర్వాహకులు వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. రోడ్డుపై భారీ వాహనాలు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. హోటళ్ల నిర్వాహకులు రోడ్డుపై పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. పోలీస్‌లకు ప్రతి నెలా మామూళ్లు తీసుకుని వారిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
మెదక్-రామాయంపేట రోడ్డుకు ఇరువైపులా కార్లు, మోటరు సైకిళ్లు నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. షాపులు, హోటళ్ల ఎదుట ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో సమస్య జఠిలమవుతున్నది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రధాన చౌరస్తాల వద్ద పోలీస్‌లు విధులు నిర్వహిస్తున్నారు. కానీ, వారు ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానాలు విధించడం, పెండింగ్ చలాన్ల వసూ లు పైనే దృష్టి పెడుతున్నారు. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వాహనదారులతో పాటు పాదచారులు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంటున్నారు.
మెదక్ పట్టణం రోజురోజుకు అభివృద్ధి చెందుతుండడంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నది. మెదక్ పాత ఆర్టీసీ బస్టాండ్, చమాన్ చౌరస్తా, తపాలా కార్యాలయం, కొత్త బస్టాండ్ ఎదుట ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటున్నది. రోడ్డు పై ఆటోలు, సైకిల్ మోటర్లు నిలిపివేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. మెదక్ పట్టణంలో ట్రాఫిక్ పీఎస్ లేక సివిల్ పోలీసులు ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నారు. మెదక్ పట్టణానికి ముఖ్యమైన నాయకులు, అధికారులు వచ్చే ముందు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారే తప్పా మిగ తా సమయాల్లో దృష్టిసారించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్యపై సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయడం లేదు. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డులు పర్యవేక్షిస్తున్నారు. హోటళ్లు, షాపుల ఎదుట వాహనాలు నిలిపితే కఠిన చర్య లు తీసుకుంటే ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదు. మెదక్‌లో కొందరు వ్యాపారులు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులు తనిఖీలకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పట్టణంలో హోటళ్ల నిర్వాహకులు, రైస్‌మిల్లుల వ్యాపారులు, పలు వ్యాపారులు అధికార పార్టీలో ఉండి నిర్భయంగా రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయిస్తున్నారు. దీంతో వారిపై చర్యలకు పోలీసులు, అధికారులు వెనుకాడుతున్నారని తెలిసింది.
మెదక్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ బస్టాండ్, చర్చి ఎదుట రోడ్డు పై వాహనాలు నిలిపివేయడంతో సమస్య ఏర్పడుతున్నది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలకు జరిమానాలు విధిస్తున్నాం. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తాం. వాహనాలు రోడ్డు పై నిలుపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హోటళ్ల నిర్వాహకులకు ఆదేశాలు ఇస్తాం.
– ప్రసన్న కుమార్, డీఎస్పీ, మెదక్