దుబ్బాక, అక్టోబర్ 24: బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అభివృద్ధి మార్గాలుగా మారాయి. పచ్చదనం, స్వచ్ఛతలో పల్లెలు, పట్టణాలు పోటీ పడుతున్నాయి. పట్టణాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు జోరందుకున్నాయి. మానవ వ్యర్థాలను ఉపయోగించుకునేందుకు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ దోహదపడనున్నది. బహిరంగ మల, మూత్ర విసర్జన నిషేధంతో ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి తప్పనిసరిగా మారింది. మరుగుదొడ్లలో నిండిన విసర్జన వ్యర్థాలతో ఎరువులు తయారు చేసి, పొలాలో వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
మానవ విసర్జితాల ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం (ఎఫ్ఎస్టీపీ- పీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మించనున్నారు. ఇందులో భాగంగా .. దుబ్బాక పట్టణ శివారులోని దుబ్బాక-హబ్షీపూర్ రోడ్డు నుంచి దుంపలపల్లికి వెళ్లే మార్గంలో ఒక ఎకరం స్థలంలో పట్టణ ప్రగతి నిధుల్లోంచి రూ.73 లక్షలతో మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించారు. రెండేండ్ల కిందట ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ప్లాంటు నిర్మాణ పనులకు శంకుస్థాన చేశారు. హైదరాబాద్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) వారి ఆధ్వర్యంలో అధికారులు టెండరు ఖరారు చేసి, ప్లాంటును పక్కా నాణ్యతా ప్రమాణాలతో నిర్మించారు.
మన ఆరోగ్యం- మన చేతుల్లోనే నినాదంతో ప్రజలకు అవగాహన పెంపొందిస్తున్నారు. ఇండ్లలో నిండిన సెప్టిక్ ట్యాంకుల నుంచి మల వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా ఈ కేంద్రానికి తరలించునున్నారు. వివిధ పద్ధతుల్లో వ్యర్థాలను దశల వారీగా శుద్ధి చేస్తారు. వాటితో సేంద్రియ ఎరువులు తయారు చేస్తారు. ఆ ఎరువును పొలాల్లో విరివిగా వినియోగించుకోవచ్చు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో బహిరంగ మల, మూత్ర విసర్జన నిషేధించడంతో రాష్ట్రంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డు నిర్మాణం తప్పనిసరిగా మారింది. దీంతో బహిరంగ మల విసర్జన తగ్గి, ఇండ్లలో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం పెరిగింది. ఇండ్లలో నిండిన మరుగుదొడ్డికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకుల నుంచి మలాన్ని కొందరు వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా రవాణా చేస్తూ, పట్టణ శివారు ప్రాంతాలు, చెరువు, కుంటల్లో వదిలేయడంతో పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యం, వ్యాధుల బారిన పడుతున్నారు. పర్యావరణం కలుషితం అవుతున్నది. దీంతో జీవరాశులకు సమస్యగా మారింది. ప్రజా ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలు నిర్మిస్తున్నది. వృథాగా పారపోసే మానవ వ్యర్థాలతో ఎరువుల తయారీ, పర్యావరణ పరిరక్షణతోపాటు మున్సిపల్‌కు ఆదాయ వనరుగా మారనున్నది.
దుబ్బాకలో మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం నిర్మాణ పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంలోని ప్లాంట్‌లో నాలుగు గదుల నిర్మాణంతో పాటు అందులో ఘన వ్యర్థాల శుద్ధీకరణకు సంబంధించిన ఆరు రకల యంత్రాలను బిగించారు. ట్రాన్స్ఫర్ స్టేషన్, క్లారిఫైయర్, ఎయిర్ బ్లోయర్, థర్మల్ ప్రాసెసింగ్ మీటర్లు, కన్వేయర్ మోటార్లు, స్లడ్జ్ స్క్రూ కన్వేయర్ యంత్రాలు ఏర్పాటు చేశారు. నీటి వ్యర్థాల నిల్వకు మూతలతో కూడిన సంపులు నిర్మించారు. కేంద్రంలో పిచ్చి మొక్కలు లేకుండా చదునుచేసి, ప్లాంట్‌లో ఆహ్లాదకరంగా ఉండేందుకు పూల మొక్కలు పెంపొందించేందుకు దృష్టి సారించారు. ప్లాంట్ రక్షణగా కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మించారు. త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణలో మున్సిపాలిటీలు, గ్రామాలు ప్రగతి బాట పట్టాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు స్వచ్ఛత, అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పట్టణాభివృద్ధిలో నూతన ఒరవడి సృష్టించారు. దుబ్బాకలో ఎఫ్ఎస్టీపీ (మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ) కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. స్వచ్ఛ దుబ్బాకలో ఈ కేంద్రం ఎంతగానో దోహదపడనున్నది. ప్రజారోగ్యంతోపాటు పర్యావరణ పరిరక్షణ వంటి ప్రయోజనాలుంటాయి. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సహకారంతో దుబ్బాక అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది.
దుబ్బాకలో ఎఫ్ఎస్టీపీ కేంద్రం ఏర్పాటు సంతోషకరం.మానవ ఘన వ్యర్థాల (ఎఫ్ఎస్టీపీ) కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరం. పట్టణ ప్రగతి నిధులు రూ.73 లక్షలతో ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ నిర్మించాం. కేంద్రంలో శుద్ధీకరణ గదులు, యంత్రాలు బిగించాంం. త్వరలోనే మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించనున్నారు. స్వచ్ఛ దుబ్బాక కోసం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు పాలకవర్గం, సిబ్బంది కృషితోపాటు ప్రజలు సహకారం ఎంతగానో ఉన్నది. దీంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం.