హుస్నాబాద్, జూలై 7: నిరుపేద కుటుంబంలో పుట్టి మట్టిలోమాణిక్యంలా ఎదిగి అప్పటి పాలకులను తన రచనలతో మెప్పించి, తన పద్యాలతో ప్రజలను ఆలోచింపజేసి, కవిత్వం, రాజయోగం కేవలం ఉన్నతవర్గాలకే కాదు సామాన్యులకు కూడా సాధ్యమని నిరూపించిన ఘనత సిద్ధప్ప వరకవి రాజయోగిది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిద్ధప్ప కవి అసలు పేరు అనంతవరం సిద్ధిరామప్ప. అనంతవరం లక్ష్మీ, పెద్దరాజయ్యల కుమారుడైన సిద్ధప్ప 1903, జూలై 9న జన్మించారు. కడుపేదరికంలోనూ పట్టుదలతో ఉర్దూ మీడియంలో ఏడో తరగతి వరకు చదివిన ఆయన తెలుగుభాషపై కూడా పట్టుసాధించి అటు కులవృత్తి కుండలు చేయడంతోపాటు తన కవితారచనలను కొనసాగించారు. ఎలగందుల, చింతకుంట గ్రామాల్లో కొన్నాళ్లు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. గాంధేయవాది అయిన సిద్ధప్ప నిత్యం తలపై టోపీ ధరించేవారు. ఉర్దూతో పాటు అరబ్బీ, పార్శి, హిందీ, ఇంగ్లిష్ భాషలపై కూడా పట్టు సాధించి రామాయణం, ఇతిహాసాలను అవపోసనపట్టి తాను ఏర్పాటు చేసుకున్న ఆశ్రమంలో 12సంత్సరాలపాటు తపస్సు చేసి తాను నిర్మించుకున్న సమాధిలోనే సామాధై యోగసిద్ధి పొందిన సిద్ధప్పకవి 120వ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, రచనలను తెలుసుకుందాం.
ఆలోచింపజేసే రచనలు
వేమన పద్యాలకు ఉన్నట్లుగానే సిద్ధప్ప రాసిన పద్యాలకు కూడా ప్రత్యేక మకుటం ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉన్నది. ‘వినుడి మాయప్ప సిద్ధప్ప విహుతుడప్ప! కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప!’ అనే మకుటం తన రచనలను ఆకట్టుకునే విధంగా ఉంది. వేమన పద్యాలకు దీటుగా ఉన్న ఆయన పద్యాలు రచయితలను, ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆయనను తెలంగాణ వేమన అని పిలిచేవారు. అప్పటి గోల్కొండ సంస్థానం వారు ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలేసి, పాలకుల నిరంకుశత్వాన్ని ప్రజలకు తెలియజేసేందుకు దివ్యాంగుడైనప్పటికీ గుర్రంపై తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసేవారు. తెలంగాణ తొలి సమాజ కవిగా, తత్వ కవిగా, గోల్కొండ కవిగా ప్రసిద్ధిగాంచిన ఆయన రజాకార్లు, పెత్తందార్ల కబంధహస్తాల నుంచి ప్రజలను రక్షించే విధంగా తన సాహిత్యంతో ప్రజలకు జ్ఞానోపదేశం చేశారు. హేతువాద, అభ్యుదయభావాలతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించడంతోపాటు ఆశు కవిత్వంతో ఆకట్టుకున్నారు. కుల, వర్గ, మత విభేదాలను వ్యతిరేకించారు.
అపర కాలజ్ఞానిగా ప్రజలకు ఉపదేశాలు
సిద్ధప్ప వరకవి దశాబ్దకాలంపాటు తన ఆశ్రమంలో తపస్సు చేసి అపర కాలజ్ఞానాన్ని సంపాదించారని ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు చెబుతుంటారు. ఆయన ఉపదేశాలతో, సందేశాలతో జీవితాలను మార్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఇప్పటికీ సజీవంగా ఉండడం విశేషం. అందుకే ఆయన జయంతి, వర్ధంతి, గురుపూర్ణిమ రోజున గ్రామంలోని ఆయన విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, భజనలు, సంకీర్తనలు చేస్తుంటారు. జరుగబోయే పరిణామాలను ముందే అంచనావేసి చెప్పేవారు. త్వరలోనే నిజాం ప్రభుత్వం పడిపోతుందని, ఊరికి ఉత్తరాన పెద్ద జలాశయం(మానేరు) ఏర్పడుతుందని, దొంగబాబాలు పుట్టుకొస్తారని, ప్రాణాంతక రోగాలు ప్రజలను హరించనున్నాయని తన రచనల్లో, ప్రసంగాల్లో చెబుతుండేవారు. జ్యోతిష్యం, వాస్తు, ఆయుర్వేదం, యోగవిద్యలోనే సిద్ధప్ప ప్రావీణుడుకావడంతో ఆయన ప్రజలకు చిరస్మరణీయుడయ్యారు. సిద్ధప్పను దైవ స్వరూపుడిగా భావించిన ఆయన శిష్యులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయన విగ్రహాన్ని దర్శించుకుంటారు.
ప్రసిద్ధిపొందిన ‘సిద్ధప్ప జ్ఞానబోధిని’ పద్యసంపుటి
సిద్ధప్ప పద్యరూపంలో రచించిన సిద్ధప్ప జ్ఞానబోధిని విశేష ప్రజాదరణ పొందింది. ప్రత్యేకమైన మకుటంతో ప్రజలను ఆలోచింపజేసే విధంగా పద్యాలను నాలుగు సంపుటాల్లో రచించారు. దీనితోపాటు ‘కాకి హంసోపాఖ్యానము’, ‘జీవనరేంద్ర నాటకం’, ‘అశోక సామ్రాజ్యం’ యక్షగానం, ‘శివస్తుతి’, విష్ణు భజనావళి’, ‘నీతిశాస్త్రం’, ‘వర్ణమాల కందార్థాలు’, ‘గోవ్యాఘ్ర సంభాషణ’, ‘బిక్కన్నవోల్ కందార్థాలు’, ‘యాదగిరి భజనావళి’ లాంటి సుమారు 40వరకు గ్రంథాలను రచించారు. పద్యప్రక్రియలతో పాటు యక్షగానం, స్తోత్రాలు, వర్ణమాల, దండకాలు, సుభాషితాలు, హితబోధ, వేదాంతతత్వ కీర్తనలు, కాలజ్ఞానం, నక్షత్రమాల, నాటకాల్లో అందెవేసిన చెయ్యి. దాదాపు అన్ని రచనల్లో ‘తప్పులున్నను దిద్దుడి తండ్రులారా’… అంటూ తన గొప్పతనాన్ని చాటుకున్నారు.
సిద్ధప్ప రచనలకు గుర్తింపునిచ్చిన
తెలంగాణ ప్రభుత్వం సమైక్యాంధ్రలో నిరాదరణకు గురైన సిద్ధప్ప వరకవి రచనలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిచ్చింది. సిద్ధప్ప సాహిత్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయన రచనలను పాఠ్యాంశాల్లో చేర్చింది. తొమ్మిదో తరగతి పాఠ్యాంశంతో పాటు ఇంటర్మీడియట్ పాఠ్యాంశంలోనూ సిద్ధప్ప రచనలు కొనసాగుతున్నాయి. సిద్ధప్ప రచనలు, జీవిత చరిత్రపై సదస్సులు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా సిద్ధప్ప కళాతోరణం ఏర్పాటు చేయడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. సురవరం సుధాకర్‌రెడ్డి తన ‘గోల్కొండ కవులు’ పుస్తకంలో సిద్ధప్ప జీవిత విశేషాలను చేర్చారు. నీలా జంగయ్య, డాక్టర్ కేకే రంగనాథాచార్యులు, డాక్టర్ బిరుదురాలు రామరాజు, డాక్టర్ జయధీర్ తిరుమల్‌రావు, డాక్టర్ ఎస్ఎస్ రాజు, డాక్టర్ వాసరవేణి పరశురాములు లాంటి కవులు సిద్ధప్ప కవిత్వాన్ని విశ్లేషించారు. ఎందరో కవులకు సిద్ధప్ప రచనలు ప్రేరణనిచ్చాయి.
గుండారెడ్డిపల్లిలోని సిద్ధప్ప కళాపీఠం అభివృద్ధికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ రూ.5లక్షల నిధులు మంజూరు చేశారు. తన తండ్రి స్ఫూర్తిని కొనసాగిస్తూ సిద్ధప్ప కుమారుడు అనంతవరం మాణిక్యలింగం కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగవిరమణ పొందడంతో పాటు కవిగా, రచయితగా, జ్యోతిష్యుడిగా, ఆయుర్వేద నిపుణుడిగా రాణిస్తున్నారు. సిద్ధప్ప రచనలు, జీవిత చరిత్రపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సిద్ధప్ప వరకవి జీవసమాధికి సిద్ధపడగా అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో తన మరణ తేదీని తానే ప్రకటించి 1984, మార్చి 23న పరమపదించారు. ఆయన శిష్యులు, గ్రామస్తులు కలిసి సమాధిని నిర్మించారు. 1996లో సమాధిపై చిన్న గుడి నిర్మించి అందులో సిద్ధప్ప విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తుంటారు. ప్రతియేటా కార్తీకపౌర్ణమి రోజున గ్రామ సంకీర్తన, సిద్ధప్ప గుడి వద్ద భజన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీశ్‌గఢ్ రాష్ర్టాల నుంచి కూడా శిష్యులు, భక్తులు వస్తుంటారు. ఆదివారం సిద్ధప్ప కవి 120వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీ. చదవలేదు నాంధ్ర సంగ్రహంబు లెస్స కనిచూడలేదొక్క కావ్యమైనా నోటబలికియు చేతనొనరంగ రాసితి
చెప్పెద మీ పాద సేవకుడను… అంటూ తన వినయత్వాన్ని చాటుకున్నారు.
సీ. అజ్ఞానియే శూద్రుడవనిలోనెవడైనా సుజ్ఞానియే యాత్మ సుజనుడతను వేదంబు చదివినా విప్రుడు విహితుండు బ్రహ్మమెరిగినోడె బ్రాహ్మణుండు… అంటూ సమాజంలోని రుగ్మతలపై తన భావజాలాన్ని చాటారు.
సీ. ఏ కుటుంబమని నన్ను ఎరుకతోనడిగేరు నా కులంబును జెప్ప నాకు సిగ్గు తండ్రి బొందిలివాడు తల్లి దాసరి వనిత మా తాత మాలోడు మరియు వినుడి… మా యత్త మాదిగ మామ ఎరుకల వాడు మా బావ బలిజోడు మానవతుడు… కాపువారి పడచు కాంతదొమ్మరి వేశ్య భార్యగావలె నాకు ప్రాణకాంత… అంటూ కులవివక్షపై తన పద్యాలతో ప్రజలను చైతన్యం చేశారు.
సీ. రాతిబొమ్మల యెదుట రాశిగాయన్నంబు తినుమన్న యారౌతు తినదురన్న… తినెడువాడవు నీవే తీవ్రంబు జెందేవు కనలేవు నీలోని కఠిన గుణము… పేదలకన్నంబు పెట్ట ధైర్యములేదు గట్టు రాళ్లకుతిండి బెట్టగలవే…? అంటూ పేదోడి ఆకలిపై తన భావనను పద్యరూపంలో చెప్పిన సిద్ధప్ప.