కొండపాక(కుకునూరుపల్లి), సెప్టెంబర్ 13 : దేశ విదేశాల్లోని నిరుపేదలకు విద్య, వైద్యసేవలు అందిస్తున్న ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ తెలంగాణలోనూ తన సేవలను అందిస్తున్నది. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం వద్ద సత్యసాయి శాంతినికేతన్ బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నది. దీంతో పాటు పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ సంజీవిని దవాఖానతో చిన్నారుల గుండెకు భరోసా అందించేందుకు ముందుకు వచ్చింది.
కొండపాక శివారులోని ఆనంద నిలయంలో 5ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో దవాఖాన నిర్మాణానికి 2022 జనవరి 17న భూమి పూజ చేయగా, 2022 నవంబర్ 17న నాటి రాష్ట్ర ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సద్గురు మధుసూదన సాయి చేతుల మీదుగా ప్రారంభోత్సవం దవాఖాన జరిగింది. కొండపాకలో సత్యసాయి సంజీవిని దవాఖానలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల గుండె సంరక్షణ పరిశోధన కేంద్రం దేశంలో నాలుగోది కావడం విశేషం.
మాతా శిశు సంక్షేమ దవాఖాన తొమ్మిదోది అని నిర్వాహకులు తెలిపారు. నయా రాయపూర్ (ఛత్తీస్‌గఢ్), పల్వల్ (హర్యానా), నవీ ముంబై (మహారాష్ట్ర)లో ఈ ట్రస్ట్ ద్వారా మాతా శిశు సంక్షేమ దవాఖానలను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. నాలుగోది గజ్వేల్ నియోజకవర్గంలో భాగమైన కొండపాక శివారులో సత్యసాయి సంజీవిని చైల్డ్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించి నిర్వహిస్తుండగా, పూర్తిస్థాయిలో వైద్యసేవలను అందుబాటులోకి తేవడంతో నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సద్గురు మధుసూదన సాయిలతో కలిసి సేవలను ప్రారంభించనున్నారు.
ఈ దవాఖాన స్థాయిని పెంచి మాతా శిశు సంక్షేమ దవాఖానగా తీర్చిదిద్దనున్నారు. సంజీవిని దవాఖానలో పూర్తిస్థాయిలో వైద్యసేవలు, మందులు , భోజన వసతి ఉచితంగా అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆధునిక వైద్య పరికరాలతో నిష్ణాతులైన వైద్యులతో పూర్తిస్థాయి డిజిటల్ ల్యాబ్ పరికరాలతో ఈ దవాఖానను ఏర్పాటు చేశారు. 100 పడకల సామర్థం నుంచి 200 పడకల సామర్థానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
కొండపాక శివారులోని ఆనంద నిలయ ట్రస్ట్ ఆవరణలో 12ఎకరాల విస్తీర్ణంలో సత్యసాయి విద్యా సంస్థను ఏర్పాటు చేసి బాలికలకు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో సంజీవిని దవాఖాన ఏర్పాటు చేసి సేవలందించేందుకు సిద్ధమయ్యారు. తన్నీరు హరీశ్‌రావు ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యేక చొరవతో, మాజీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి సూచనలతో ఈ దవాఖానను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
గతంలో సత్యసాయి విద్యాసంస్థల వార్షికోత్సవ సమయంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి మధుసూదనా సాయితో హరీశ్‌రావు ప్రత్యేకంగా మాట్లాడి సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రాంతంలో దవాఖాన నిర్మాణం చేయాలని కోరారు. అప్పటి సీఎం కేసీఆర్, ముఖ్య సలహాదారు కేవీ రమణచారి సహకారంతో ఆనంద నిలయం ట్రస్ట్ ఆవరణలో 3 ఎకరాల భూమిని దవాఖానకు నిర్మాణానికి ఇవ్వడంతో పాటు మరో 2ఎకరాల భూమిని ఆనంద నిలయం ట్రస్ట్ నుంచి నామమాత్రపు ధర చెల్లించి కొనుగోలు చేసి 5 ఎకరాల్లో అధునాతన భవంతిలో దవాఖానతో పాటు రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో సిద్దిపేట జిల్లాతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.