పటాన్చెరు, డిసెంబర్ 5 : ఔటర్ రిండ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు సమీపంలో ఉన్న మున్సిపాలిటీలను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.. పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను విలీనం చేస్తూ పురపాలక శాఖ జీవో 364ను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు మున్సిపాలిటీల్లోని కౌన్సిల్ తీర్మానాలు, మిని ట్స్ బుక్‌లు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు జీహెచ్ఎంసీ ఖాతాలో జమచేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాల్ కార్యాలయాలకు జీహెచ్ఎంసీ పేరిట బోర్డులు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్లుగా పనిచేసిన వారికి డిప్యూటీ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు.
తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలను శేరిలింగంపల్లి జోన్ పరిధిలో విలీనం చేశారు. బొల్లారం మున్సిపాలిటీని కూకట్పల్లి జోన్లో విలీనం చేశారు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేయడంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో అనుమతుల కోసం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని వ్యతిరేత తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భౌగోళిక స్వరూపం పరిశీలించకుండా విలీనం చేసిందని, దీంతో భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని ప్రజలు పేర్కొంటున్నారు. జీహెచ్ఎంపీ పరిధిలో రామచంద్రాపురం, పటాన్చెరు, భారతీనగర్ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మున్సిపాలిలు విలీనం కావడంతో డివిజన్లు పెరిగే అవకాశం ఉంది.
తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీ రికార్డులను జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిర్మాణ అనుమతులు జారీ చేయకుండా, బిల్లులు చెల్లించకుండా ఆదేశాలు జారీ చేశారు. మూడు మున్సిపాలిటీల పరిధిలోని ఉద్యోగుల వివరాలు, మున్సిపాలిటీ స్వరూపం, సిబ్బంది వివరాలు, కార్యాలయానికి సంబంధించిన స్థిర, చరాస్తులు, డిపాజిట్లు, పెట్టుబడులు, పన్నులు, ఇతర ఆదాయం వివరాలు సేకరిస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపు, భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ అనుమతులకు సంబంధించిన సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. రికార్డులు స్వాధీనం చేసుకునే సమయంలో అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం బొల్లారం మున్సిపాలిటీని జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్లో విలీనం చేయడంపై బల్దియా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. భౌగోళిక స్వరూపం పరిశీలించకుండా విలీనం చేశారనే విమర్శలు వస్తున్నాయి. శేరిలింగంపల్లి జోన్లో విలీనం చేయాలని ప్రజలు కోరుతున్నారు. జీహెచ్ఎంసీలో విలీనంపై నాయకులు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది. బొల్లారం మున్సిపాలిటీ 2018లో ఏర్పాటు చేశారు. మున్సిపల్ పరిధి 8.35 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 13,115 జనాభా ఉంది. ఈ మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి.
ఓఆర్ఆర్కు సమీపంలో బొల్లారం బల్దియా ఉంటుంది. తెల్లాపూర్ మున్సిపల్ 2018లో ఏర్పాటు కాగా, 2011 జనాభా లెక్కల ప్రకా రం 24,193 జనాభా, 12 వార్డులు ఉన్నాయి. అమీన్పూర్ మున్సిపల్‌ను 2018 లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మున్సిపాలిటీ విస్తీర్ణం 17.84 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. 44,698 జనాభా, 15 వార్డులు ఉండేవి. శుక్రవారం వరకు మున్సిపల్ విలీన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ప్రభుత్వం జారీచేసింది. విలీన ప్రక్రియపై అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ప్రజాభిప్రాయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విలీనం చేసిందనే విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేయడంతో అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకునే సందర్భంలో కొన్ని ఫైళ్లు తారుమారు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వార్డుల పునర్విభజనపై ప్రభుత్వం డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.