సిద్దిపేట, జులై 15: సీజనల్ వ్యాధులు విజృంభించి అనేకమంది చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ దవాఖానల్లో సదుపాయాలు, మందుల సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. సిద్దిపేట నియోజకవర్గంలో మెడికల్ కళాశాల దవాఖానతోపాటు, నంగునూరు సీహెచ్‌సీ, నారాయణరావుపేట, పుల్లూరు, ఇబ్రహీంనగర్, రాజగోపాల్‌పేట, చిన్నకోడూర్ పీ హెచ్‌సీలతోపాటు, అంబేదర్నగర్, నాసర్‌పురా అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు ఉన్నాయి. ఈ దవాఖానలకు ప్రభుత్వ డీఎంహెచ్‌వో స్టోర్, సీఎంఎస్ నుం చి మందులు నేరుగా సరఫరా అవుతాయి. ఈ -ఔషధి ద్వారా ఆయా దవాఖానల్లో అవసరమున్న మందులను ఇండెంట్ తీసుకొని ఎప్పటికప్పుడు సరఫరా చేస్తా రు. కొన్ని పీహెచ్‌సీల్లో బీపీ పేషెంట్లు వాడేటువంటి టెల్మిసెట్రిన్ 40 ఎంజీ గోలీలు నెల రోజుల నుంచి సరఫరా కావడం లేదు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారి కోసం అందించే పాన్టాబ్ టాబ్లెట్స్ రెండు నెలలుగా సరఫరా కావడం లేదు. టైఫాయిడ్, మలేరియా, డెంగీ, వ్యాధి నిర్ధారణ కోసం ఉపయోగించే టెస్టింగ్ కిట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జనరల్ దవాఖానతోపాటు, సీహెచ్‌సీలకు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఈ వ్యాధుల నిర్ధారణకు పీహెచ్‌సీల్లో టెస్టింగ్ కిట్లు కూడా అందుబాటులో లేవు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లతోపాటు, మెడికల్ కాలేజ్ జనరల్ దవాఖాన, గజ్వేల్ జిల్లా దవాఖానల్లో అన్ని రకాల మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. కొరతగా ఉన్న మందులను ఎప్పటికప్పుడు తెప్పించుకొని, రోగులకు అందుబాటులో ఉంచుతున్నాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.