మెదక్, సెప్టెంబర్ 3 (నమస్తేతెలంగాణ): మెదక్ జిల్లా లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శని, ఆదివారాల్లో వర్షం బీభత్సం సృష్టించగా, సోమవారం ముసురు వాన కురిసింది. దీంతో జిల్లాలోని చెరువులన్నీ నిండిపోయాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరివారం వరకు చెరువులు అలుగు పారేవి కావు…కానీ సెప్టెంబర్ ప్రారంభంలోనే భారీ వర్షాలు పడటంతో మెజార్టీ చెరువులు నిండాయి.
ఎడతెరిపి లేని వర్షాలకు చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి భారీ గా నీరు చేరుతోంది. జూన్, జూలై, ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదైంది. నాలుగు రోజులుగా భారీ వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని పంటలకు మేలు జరగ్గా, మరికొన్ని పంటలకు నష్టం జరిగింది. మెదక్ జిల్లా లో 752.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికంగా మెదక్‌లో 1041 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా మనోహరాబాద్‌లో 545 మి. మీ వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఘనపూర్, హల్దీ, రాయిన్‌పల్లి ప్రాజెక్టుల్లో నీళ్లు ఫుల్
మెదక్ జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు అయిన ఘనపూర్ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. వెల్దుర్తి సమీపంలో ఉన్న హల్దీప్రాజెక్టు, మెదక్ మండలం రాయిన్‌పల్లి ప్రాజెక్టు, మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్ పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటుంది. ఘనపూర్ ఆనకట్ట పొంగడంతో ఏడుపాయల వనదుర్గమాత ఆల యం మూసివేశారు. జిల్లాలో 2694 చెరువులు ఉండ గా 475 చెరువులు అలుగు పారుతున్నాయి. 25 నుం చి 50 శాతం నిండినవి 461 చెరువులు కాగా, 50 నుంచి 75 శాతం నిండినవి 931, 75 నుంచి 100 శాతం నిండినవి 827 చెరువులు ఉన్నాయని ఇరిగేషన్‌శాఖ డీఈఈ శివనాగరాజు తెలిపారు.
165 ఎకరాల్లో నీట మునిగిన పంటలు
ప్రస్తుత వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అయితే
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో 165 ఎకరాల్లో మా త్రమే పంటలు నీట మునిగాయి. హవేళీఘనపూర్‌లో 65 మంది రైతులకు చెందిన 105 ఎకరాలు, బూర్గుపల్లిలో 15 మంది రైతులకు చెందిన 35 ఎకరాలు, రాజ్పేటలో 15 మంది రైతులకు చెందిన 25 ఎకరాల వరి పంటనీట మునిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 233 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇందులో అత్యధికం గా కొల్చారం మండలంలో 21, చేగుంట మండలంలో 12, పెద్దశంకరంపేట మండలంలో 11, మెదక్ మండలంలో 10, పాపన్నపేట మండలంలో 10 ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి.
సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షం
సిద్దిపేట, సెప్టెంబర్ 3: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం వల్ల సిద్దిపేట జిల్లా వ్యాప్తం గా మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం ఉద యం వర్షం తెరిపి ఇచ్చింది. మధ్నాహ్యం తర్వాత చిరుజల్లులతో కూడిన వర్షంతోపాటు అక్కడకక్కడ మోస్తరు వర్షం పడింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయి. వర్షం ప్రభావంతో జిల్లాలోని పలు గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయాయి. గజ్వేల్ మండలం అక్కారంలోని కోనాపూర్ చెరువును కలెక్టర్ మనుచౌదరి సందర్శించారు. వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న దృష్ట్యా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుం డా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 1.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కుకునూరుపల్లిలో 3.62 సెం.మీ, అత్యల్పంగా నారాయణరావుపేట మండలంలో 0.16 సెం.మీ వర్షం పడింది.
సింగూరుకు కొనసాగుతున్న వరద
పుల్కల్, సెప్టెంబర్ 3: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు 24,301 క్యూసెక్యుల నీరు రాగా సాయంత్రం ఆరుగంటల వరకు సుమారు 10వేల క్యూసెక్యుల నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వరద తీవ్రత 33,920 క్యూ సెక్యులు వస్తుందన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అధికారులు ప్రాజెక్టు వద్ద వరదను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వరద ఎక్కువ వస్తున్న సందర్భంగా సందర్శకుల తాకిడి ఎక్కువైంది కానీ ప్రాజెక్టుపైకి అనుమతించడం లేదు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 33, 920 క్యూసెక్యులు కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 21.536 టీఎంసీల నీరు నీల్వ ఉండగా అవుట్ ఫ్లో 401 క్యూసెక్యులు దిగువకు వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు.