శివ్వంపేట, జనవరి 18: రక్త సంబంధాన్ని మర్చి సొంత అన్ననే తమ్ముడు కడతేర్చిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యతండా పంచాయతీ ననూతండాలో చోటుచేసుకుంది. తూప్రాన్ సీఐ రంగ కృష్ణ వివరాల ప్రకారం… ననూతండాకు చెందిన తేజావత్ చందర్‌కు శంకర్ (28), గోపాల్ (22) ఇద్దరు కుమారులు సంతానం. గోపాల్ ఈ మధ్యనే ఓ చోరీ కేసులో జైలు నుంచి విడుదలయ్యాడు. అన్నదమ్ములిద్దరికీ గతంలో గొడవలు జరిగాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న తమ్ముడు గోపాల్ ఎలాగైనా అన్న శంకర్‌ను చంపాలని నిర్ణయించకున్నాడు.
శనివారం రాత్రి అన్నదమ్ములు ఇద్దరు ఒకేరూమ్‌లో పడుకున్నారు. రాత్రి 12:30 గంటల ప్రాంతంలో నిద్రలేచిన గోపాల్ అన్న శంకర్ కాలికి, చేతికి విద్యుత్ వైర్లు కట్టి స్విచ్ బోర్డులో పెట్టడంతో షాక్‌కు గురై మృతిచెందాడు. శంకర్ అరుపులకు లేచిన తండ్రిని చూసి గోపాల్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తూప్రాన్ సీఐ రంగ కృష్ణ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి చందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితుడు గోపాల్‌ను 8 గంటల్లోపే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.