హుస్నాబాద్, మార్చి 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రతి శుక్రవారం జరిగే వార సంత(అంగడి)కి ప్రత్యేకత ఉంది. చుట్టూ 40కిలోమీటర్ల పరిధిలో ఇంత పెద్ద అంగడి మరెక్కడా జరగదు. ఇక్కడికి హుస్నాబాద్ మం డలం నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాలు, ఇతర జిల్లాల వారు వచ్చి పశువులు, మేకలు, గొర్రెలు, కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు, అమ్మకాలు చేస్తుంటారు. పశువుల సంత ఇక్కడి ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ అంగడి ఏర్పడినప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతున్నది.
శుక్రవారం వచ్చిందంటే హుస్నాబాద్ పట్టణంలో దుకాణాలు, పశువులు, ఇతర సామగ్రికి సంబంధించిన షాపు లు, వాహనాలు తదితరాలతో పట్టణం మొత్తం రద్దీగా మారుతుంది. అంగడితో ఒక్కరోజే కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ఇంత టి ప్రాధాన్యత ఉన్న హుస్నాబాద్ అంగడి ఆదాయానికి కొందరు గండికొట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా అంగడి వేలం ఆదాయం పెరగాల్సింది పోయి తగ్గుతున్నది. అధికారుల నిర్లక్ష్యంతో అంగడి ప్రాంతం లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, టెండర్లలో లాభాపేక్షకే ప్రాధాన్యం ఇవ్వడంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
1977లో రూ.9వేల వేలంతో ప్రారంభం
హుస్నాబాద్ పట్టణంలో మొదట గాంధీ విగ్ర హం వద్ద 1953లో అంగడి ప్రారంభమైంది. దీనికి 1977లో తొలిసారి వేలం నిర్వహించగా, రూ.9వేల ఆదాయం వచ్చిందని పట్టణ సీనియర్ సిటిజన్స్ చెబుతున్నారు. పట్టణం మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత రూ. 60 లక్షల ఆదాయం వచ్చింది. అనంతరం ఏటా వేలం ధర పెరుగుతూ వచ్చిందే తప్పా తగ్గలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వేసిన వేలంలో కాంట్రాక్టర్లు రూ. 1,20,26,000లకు అంగడిని దక్కించుకున్నా రు. గతేడాది 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 92,20,667లకు మాత్ర మే వేలం జరిగింది. సుమారు రూ.28 లక్షల ఆదాయం తగ్గింది. మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు, పాలకవర్గం కుమ్మక్కై వేలాన్ని కుదించారనే విమర్శలు ఉన్నాయి.
సౌకర్యాలు కరువు
హుస్నాబాద్ పట్టణం వ్యాపార, వాణిజ్య రం గంలో దూసుకుపోతున్నది. అందుకు అనుగుణంగా అంగడి ప్రాంతంలో సౌకర్యాలు కల్పిం చి, ఏటా ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అధికారులు అలా చేయడం లేదనే విమర్శలు ఉన్నా యి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్నచిన్న అంగళ్లు వెలుస్తున్నాయి. దీంతో హుస్నాబాద్ అంగడికి ప్రాధాన్యం తగ్గుతోంది. అంగడిలో ఇప్పటికీ పశువులకు నీళ్లు పెట్టేందుకు నీటి సౌకర్యం లేకపోవడం గమనార్హం. కేవలం ఒక రేకులషెడ్డు వేసి అధికారులు చేతు లు దులుపుకొన్నారు. పశువులకు నీటి తొట్లు, నీడ కోసం ఏర్పాట్లు చేయడం, అంగడికి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
అంగడి వేలం దక్కించుకు న్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు. పశువు అమ్మినా, కొన్నా రూ.250 ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, ఒక్కో వారం రూ.300ల నుంచి రూ. 400లు వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. గొర్రె, మేకకు రూ. 200లకు బదులు అదనంగా ఫీజు వసూలు చేస్తున్నారు. కూరగాయల విక్రయదా రులు, హోటళ్లు, చేతి వృత్తుల వారి నుంచి అధికంగా ఫీజు వసూలు చేయ డంతో అంగడికి వచ్చేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు.
రూ.కోటి దాటిస్తారా? కుమ్మక్కవుతారా?
రూ.9వేలతో ప్రారంభమైన హుస్నాబాద్ వార సంత(అంగడి) దినదినాభివృద్ధి చెంది రూ.కోటి దాటే వరకు వచ్చింది. కానీ, కొందరి నిర్లక్ష్యంతో గతేడాది కేవలం రూ.92లక్షలకే పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈనెల 18న అంగడి వేలం వేసేందుకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. 2024-25ఆర్థిక సంవత్సరంలో రూ.1.20కోట్లు దాటిన వేలం ఈ ఆర్థిక సంవత్సరంలోనూ దాటుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2025-26 సంవత్సరంలో మాదిరిగానే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అంగడి వేలాన్ని రూ.కోటి లోపు పూర్తి చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ 2026-27లో రూ. కోటి లోపే వేలం పూర్తి చేస్తే అది పాలకవర్గం, అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కుతోనే జరుగుతుందని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.