మిరుదొడ్డి, జూలై 9: ఉమ్మడి మిరుదొడ్డి మండలంలో 22 ప్రాథమిక, 3 అప్పర్ ప్రైమర్ స్కూల్స్, 13 జడ్పీ పాఠశాలలు కలిపి మొత్తం 38 ఉన్నాయి. వీటిలో 3503 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 38 పాఠశాలల్లో 82 మంది మధ్యాహ్న భోజన కార్మికులు విధులు నిర్వహింస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం వండిపెడుతున్నారు. వీరికి రూ.3 వేల చొప్పున గౌరవ వేతనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నవి. అందులో రూ. వెయ్యి రూపాయలు కేంద్ర ప్రభుత్వం తన వాటా బ్యాంకుల్లో జమ చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మిగతా రూ.2 వేల చొప్పున గౌరవ వేతనం ఇప్పటికీ వేయలేదు. మిరుదొడ్డి మండలంలో 82 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రూ.8.20 లక్షలు చెల్లించాల్సి ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కోడి గుడ్ల డబ్బులు మొత్తం రూ.12 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని గోడు వెళ్లబోసుకుంటున్నారు. సర్వశిక్షా అభియాన్, ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ) నెల వేతనం 11 మందికి కలిసి రూ.3 లక్షల వరకు రావాల్సి ఉంది.