సంగారెడ్డి, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ):సం గారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులను వెంటనే ప్రారంభించాలని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చిం తా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న తొమ్మిది ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.
గోదావరి జలాలు సంగారెడ్డికి తీసుకువచ్చేందుకు కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ రెండు ఎత్తిపోతల పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులకు వందశాతం రుణమాఫీ అమలు చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేసినట్లు ప్రకటించినా రాష్ట్రంలో, సంగారెడ్డి జిల్లాలో రైతుల ఖాతా ల్లో ఇంత వరకు డబ్బులు పడలేదన్నారు. రుణమాఫీ కోసం రూ.2745 కోట్లు విడుద చేశామని, ఇందులో సంగారెడ్డి జిల్లాకు రూ.110 కోట్లు విడుదల చేసినట్లు రేవంత్‌రెడ్డి చెప్పి 15 రోజులు దాటి నా ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదన్నారు.
కేసీఆర్ హయాంలో సంగారెడ్డి జిల్లాలోని 1073 చెరువుల్లో అక్టోబర్ వరకు వందశాతం చేప పిల్లలు వదిలామని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 79 చెరువుల్లో మాత్రమే చేప పిల్లలు సగం సం ఖ్యలో మాత్రమే వదిలినట్లు తెలిపారు. తద్వారా ముదిరాజ్‌లు, గంగపుత్రులు ఉపాధి కోల్పోతున్నట్లు తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తమ హయాంలో సంగారెడ్డిలోని కందిలో ముదిరాజ్, లింగాయత్, గౌడ, పద్మశాలి కుల భవనాల నిర్మాణానికి ఎకరం చొప్పున స్థలం కేటాయించి రూ. 25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసి టెం డర్లు పిలిచినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులు చేయకుండా భూములు వెనక్కితీసుకునే ప్రయత్నం చేస్తున్నదని, దీనిపై ఉద్యమం తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు.
పనులకు ప్రారంభించకపోతే కలెక్టరేట్ దిగ్బంధిస్తాం
ప్రభుత్వం సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఎంఆర్ఆర్, ఎస్డీఎఫ్ పనులను రద్దు చేసి, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో మా త్రం కొనసాగిస్తూ వివక్ష చూపడం తగదని, సంగారెడ్డి, జహీరాబాద్‌లో ఎస్డీఎఫ్, ఎంఆర్ఆర్ పను లు ప్రారంభించక పోతే కలెక్టరేట్ దిగ్బంధిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. కేసీఆర్ సర్కార్ సం గారెడ్డి, సదాశివపేట మున్సిపాటీలకు మంజూరు చేసిన వెజ్,నాన్‌వెజ్ మార్కెట్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం మంచి పద్ధతి కాదన్నారు. కంది, ఆరుట్ల, ఫసల్వాది, ఇంద్రకరణ్ గ్రామాల్లోని రైతులు ల్యాండ్‌పూలింగ్‌కు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, వారికి ఇండ్ల స్థలా లు, ఇతర బెనిఫిట్స్‌ను ఇవ్వకపోవడంపై సరికాదని, ఈ విషయంలో వారికి న్యాయం చేయాలని కోరారు. సర్వే నెంబరు 599లో 150 మంది రిటై ర్డు పోలీసు అధికారులకు ఇంటి స్థలాలు యథావిధిగా వారికి కేటాయించాలని కోరారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కలెక్టర్‌కు వినతి ప్రతం అందజేత
తొమ్మిది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు కాంత్రికి హరీశ్‌రావు అందజేశారు. కలెక్టర్ పరిధిలో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని, మిగతావి ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
అమరవీరులకు నివాళి
సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పూలమాలవేసి జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పా టు అనంతరం నాడు మంత్రి హోదాలో హరీశ్‌రావు ప్రత్యేకంగా చొరవ తీసుకుని సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయించారు. కేసీఆర్ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయలేదంటూ దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో హరీశ్‌రావు బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సందర్శించారు. కలెక్టరేట్ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పట్నం మాణిక్యం,మామిళ్ల రాజేందర్, వెంకటేశ్వర్లు, మందుల వరలక్ష్మి, కొండల్‌రెడ్డి, శ్రీహరి, సాబేర్, జీవీ శ్రీనివాస్, విఠల్, మనోహర్ గౌడ్, నాగరాజు గౌడ్, రాజు, శ్రవణ్‌రెడ్డి, నందకిశోర్ ఉన్నారు.
మాజీ ఎమ్మెల్సీకి పరామర్శ
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణను ఎమ్మెల్యే హరీశ్‌రావు సంగారెడ్డిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.