అందోల్, జనవరి 7: సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక వ్యాపారం మూడు పువ్వు లు.. ఆరు కాయలుగా సాగుతూ కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు, ఇతరత్రా నిర్మాణాలకు భారీగా ఇసుక అవసరం ఏర్పడడంతో ఇదే అదునుగా భావించి ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలోని చెరువులే అడ్డగా రాత్రి వేళ్లలో ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. ఈ అక్రమ ఇసుక దందాపై స్థానికులు ఫిర్యాదులు చేసి నా సంబంధిత అధికారులు అరకొర దాడు లు చేసి, ఆ తర్వాత చేతులు దులుపుకొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాల్టా చట్టానికి దర్జాగా తూట్లు పొడుస్తున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అందోల్ మండలం చింతకుంట, చౌటకూర్ మండలంలో సరాఫ్పల్లి, శివంపేట్, కోర్పోల్ గ్రామాల్లో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతున్నది. ఇక్కడ సింగూ రు బ్యాక్ వాటర్ ప్రవహిస్తుండడంతో ఇసుక మేటలు భారీగా ఉంటాయి. దీంతో కొంతమంది వ్యాపారులు ఇసుకపై కన్నేసి రాత్రికి రాత్రే ట్రాక్టర్లు, టిప్పర్లలో లోడు చేసి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తూ, లబ్ధి పొందుతున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులు ఒక్కో ట్రాక్టర్కు రూ. 5 నుంచి 6వేల వరకు వసూలు చేస్తున్నారు. టిప్పర్కైతే సుమారు రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇక్కడ నుంచి ఇసుకను ఉమ్మడి పుల్కల్తో పాటు పక్కనే ఉన్న అందోల్, సంగారెడ్డి మండలాలలకు సైతం తరలిస్తున్నారు. దారిపొడుగునా పోలీస్, రెవెన్యూ అధికారుల నుంచి ఇబ్బందులు రాకుండా కొంతమంది అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇసుక తరలింపులో స్థానికుల నుంచి ఇబ్బందులు రాకుండా వ్యాపారులు స్థానికంగా పలుకుబడి కలిగిన అధికార పార్టీ నాయకులను మచ్చిక చేసుకుని వారి ద్వారా సంబంధిత అధికారులతో వారికి కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు.
వాల్టా చట్టం అధికార నాయకులకు చుట్టం
చెరువుల్లో నుంచి ఇసుకను తరలిస్తున్న దృశ్యాలు రోడ్లపై నిత్యకృత్యమైంది. అధికారులు ఇసుక తరలింపుపై కనీస చర్యలు చేపట్టడంలేదని స్థానికంగా ఆరోపణలున్నాయి. దీంతో విసుగు చెందిన స్థానికులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, పత్రికల్లో కథనాలు రావడంతో స్పదించిన అధికారులు అడపాదడపా దాడులు చేయడం, ఇసుక నిల్వలు సీజ్ చేయడం లాంటి తాత్కాలిక చర్యలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు ఓ చోట ఇసుక తీస్తుంటే, అధికారులు మరో చోట దాడులు చేస్తున్నారు.
ఇప్పటివరకు ఇసుక తరలించే క్రమంలో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోలేదని, ఎలాంటి కేసులు నమోదు చేయడంలేదని, దీంతో ఇసుక అక్రమ రవాణా ఎలా ఆగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, అధికార పార్టీ నాయకులు, వ్యాపారులు ఒక్కటై ఇసుక దందాను యథేచ్ఛగా చేస్తున్నారని, ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే అక్రమ దందాకు తెర పడుతుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు
సింగూర్ బ్యాక్ వాటర్ సమీపంలో నుంచి ఇసుకను అక్రమంగా తరలించినా, డంపుచేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే పలుమార్లు ఇసుక డంపులపై దాడులు చేసి కేసులు నమోదుచేశాం. కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం ఉన్నది. అందుకే ఆయా గ్రామాలో ్ల మా సిబ్బందిని రాత్రి సమయంలో సైతం గస్తీ నిర్వహించాలని చెప్పాం. ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంతటివారైన సరే ఉపేక్షించేదిలేదు..కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తాం.
– కిష్టయ్య, తహసీల్దార్, చౌటకూర్, (సంగారెడ్డి జిల్లా )