సంగారెడ్డి, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు పర్యావరణ పరిరక్షణను పట్టించుకోలేదు. ఫలితంగా వర్షాలు లేక సంగారెడ్డి జిల్లా ప్రజలు కరువుతో అల్లాడాల్సిన పరిస్థితి. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ పిలుపుతో ప్రజలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. హరితహారంలో సంగారెడ్డి ప్రజలు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ప్రభుత్వం పట్టణాలు, ప్రతి పల్లెలో నర్సరీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పదిశాతం బడ్జెట్‌ను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించింది. సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది విడతలుగా హరితహారం పూర్తయ్యింది. ఎనిమిది విడతల్లో 8.77 కోట్ల మొక్కలను నాటారు. జిల్లాలో గత 60 ఏళ్లలో నాటిన మొక్కలకన్నా 10 రెట్లు ఎక్కువ మొక్కలను హరితహారంలో నాటారు. హరితహారం మొక్కలు నాటడంతో జిల్లాలో 3.5 శాతం మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. హరితహారంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 743 పల్లె ప్రకృతి వనాలు, 61 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఎనిమిది విడతల్లో సంగారెడ్డి జిల్లాలో 8,77,91,970 మొక్కలను నాటగా, 9వ విడత హారితహారంలో 40,76,500 మొక్కలు నాటనున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఇటీవలే సంగారెడ్డి కలెక్టరేట్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్‌తోపాటు జిల్లా ఎమ్మెల్యేలు పాలుపంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షణలో సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయానికి ఐఎస్ఓ అవార్డు సైతం లభించింది.
9వ హరితహారంలో విడతలో 40,76,500 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధారించారు. గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో 34,36,500 మొక్కలు నాటనున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 25 లక్షల మొక్కలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 4.36 లక్షల మొక్కలను పట్టణాలు, పల్లెలు, రహదారుల పక్కన నాటనున్నారు. 9వ విడత కోసం జిల్లా యంత్రాంగం నర్సరీల్లో 69.11 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచింది. జిల్లాలో మొత్తం 659 నర్సరీలు ఉన్నాయి. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీలో ఒకటి చొప్పున 647 నర్సరీలున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో నాలుగు, మున్సిపాలిటీల్లో ఎనిమిది నర్సరీలున్నాయి. ఈ నర్సరీల్లో 69.11 లక్షల మొక్కలు సిద్దంగా ఉంచారు. డీఆర్డీఏ నర్సరీల్లో 61.73 లక్షలు, అటవీశాఖ నర్సరీలో ఆరు లక్షలు, మున్సిపాలిటీ నర్సరీల్లో 1.38 లక్షల మొక్కలు సిద్ధంగా ఉంచారు.
హరితహారం ద్వారా సంగారెడ్డి జిల్లాలో 8,77,91,970 మొక్కలు నాటారు. హరితహారంలో ప్రభుత్వం ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీల్లోనూ నర్సరీలను ఏర్పాటు చేసింది. బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంతో సంగారెడ్డి జిల్లాలో అటవీ విస్తీర్ణం 3.5 శాతం మేర పెరిగింది. మొదటి విడత హరితహారంలో 2015-16లో సంగారెడ్డి జిల్లాలో 50 లక్షల మొక్కలను నాటారు. రెండో విడత హరితహారం 2016-17లో 1.03 కోట్ల మొక్కలను నాటారు. 2017-18లో నిర్వహించిన మూడో విడత హరితహారంలో 1.50 కోట్ల మొక్కలను నాటారు. 2018-19లో నాలుగో విడత 1.38 కోట్ల మొక్కలు నాటారు. 2019-20 ఐదో విడత 1.99 కోట్ల మొక్కలు, 2020-21లో ఆరో విడత 82.26 లక్షలు, 2021-22లో ఏడో విడత 57.32 లక్షలు, 2022-23లో 8వ విడతలో 96.35 లక్షల మొక్కలు నాటారు.