జహీరాబాద్, జూన్ 17 :సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ ఆర్అండ్బీ ప్రధాన రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను సంబంధిత ఆర్అండ్బీ అధికారులు పూడ్చివేశారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ:’ దిన పత్రికలో ప్రచురితమైన ‘అడుగుకో గుంత.. ప్రయాణం చింత’అనే కథనానికి సంబంధిత జిల్లా అధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం జహీరాబాద్, న్యాల్కల్ మండలాల పరిధిలోని కోత్తూర్, దిడ్గి, మిర్జాపూర్(బీ), ఖలీల్పూర్, గంగ్వార్, మెటల్‌కుంట, న్యామతాబాద్ గ్రామ శివారుల గుండా వెళ్లే జహీరాబాద్-బీదర్ రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా మారిన గుంతలను ఆర్అండ్బీ డీఈఈ రామకృష్ణ, ఏఈలు సంధ్య, శ్రీనివాస్ పరిశీలించారు.
పలు గ్రామాలకు చెందిన ప్రజలు, వాహనచోదకులు బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. గుంతలకు మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు, హద్నూర్ ఎస్సైలు దోమ సుజిత్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాదకరంగా మారిన గుంతలను జేసీబీతో తవ్వి కంకర మెటీరియల్ వేసి బీటీ వేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు న్యాల్కల్ మండలం ఖలీల్పూర్ గ్రామ శివారులో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి యువకుడి మృతి చెందిన స్థలాన్ని సందర్శించారు. ఘటనకు సంబంధించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే సంబంధిత ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రవీందర్, తట్టు నారాయణ, సంజీవ్‌రెడ్డి, మచ్చేందర్, రాజ్‌కుమార్ ఉన్నారు.