గజ్వేల్, డిసెంబర్ 14: రోడ్డు బాగు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన అధికారులు, రోడ్డుకు ఇరువైపులా సైడ్వాల్ నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గమ్యస్థానాలకు చేరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ-బూరుగుపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. కొడకండ్ల నుంచి క్యాసారం వైళ్లే కాళేశ్వరం కాలువ వద్ద వేసిన సీసీ రోడ్డు బీటలు వారింది. కాలువ సమీపంలోనే వాగు ఉండడంతో గతంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. కాలువ నుంచి వాగుబ్రిడ్జి వరకు సైడ్వాల్ నిర్మాణం చేపట్టకపోవడంతో వాహనదారులు భయంతో ప్రయాణించాల్సి వస్తున్నది.
ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయానికి గురవుతున్నారు. రోడ్డుపై నుంచి కిందపడితే ఇక అంతే. కాలువ పైనుంచి కింది వరకు వేసిన సీసీ రోడ్డు మధ్యలో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. రిమ్మనగూడ రాజీవ్ రహదారి నుంచి ఇదే మార్గంలో బూరుగుపల్లి, దాచారం, సింగా టం, అనంతరావుపల్లి, తిప్పారం గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ ప్రాంతాలకు ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.