అల్లాదుర్గం, జూలై 31: ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధపెట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. గురువారం అల్లాదుర్గం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మండల పరిధిలోని గడిపెద్దాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ముస్లాపూర్‌లోని పశువుల దవాఖానను తనిఖీ చేశారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు, ఫర్టిలైజర్ షాప్‌లను తనిఖీ చేశారు. గడిపెద్దాపూర్‌లోని ఆరోగ్య కేంద్రంలో స్టోర్, రక్త పరీక్ష గది, ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించి సేవలపై ఆరాతీశారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ముస్లాపూర్‌లోని పశువుల దవాఖానలో మందుల స్టాక్, వ్యాక్సిన్ నిల్వలు పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి పథకంలో 600 గజాల్లోలోపు మాత్రమే ఇంటి నిర్మాణం చేపట్టేలా చూడాలని హౌసింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ఎరువులు,పురుగుల మందులకు కొరత లేదని, ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టాలేని రైతులకు ఆధార్ ఆధారంగా అవసరం మేరకు యూరియ ఇవ్వాలని ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పోలీస్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మల్లయ్య, స్థానిక ఎంపీడీవో చంద్రశేఖర్, వైద్య సిబ్బంది ఉన్నారు.