చేర్యాల, ఆగస్టు 9: తెలంగాణ హైవేస్ అథారిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట, సిరిసిల్ల (365బీ) జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జనగామ నుంచి దుద్దెడ వరకు చేపట్టిన పనులు చివరి దశకు చేరుకున్నాయి. రోడ్డు విస్తరణ, కొత్తగా కల్వర్టుల నిర్మాణం, గ్రామాల్లో డివైడర్లు, సేఫ్టీ వాల్వాలు తదితర వాటిని జాతీయ రహదారి పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ చేపట్టారు.
ఇప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ సిద్దిపేట జిల్లా జనగామ నుంచి దుద్దెడ వరకు రాజీవ్ రహదారి వరకు ఉన్న గ్రామాల పేర్లతో బోర్డులను సంబంధిత శాఖ ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామాలతో కూడిన నేమ్బోర్డుల్లో ఉన్న గ్రామాల పేర్లను చూసి వాహనదారులతో పాటు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు చదువుకున్నవారు బోర్డులపై గ్రామాల పేర్లు రాశారా లేక నిరక్షరాస్యులు పేర్లు అచ్చువేశారా అని ప్రశ్నిస్తున్నారు.
బోర్డుపై ఇంగ్లిష్తో పాటు తెలుగుతో గ్రామాల పేర్లను అచ్చువేశారు. సిద్దిపేట నుంచి చేర్యాలకు వస్తున్న క్రమంలో జాతీయ రహదారిపై ఉన్న ముర్రిముస్త్యాల పేరును బోర్డుపై మర్రిముస్తియాలగా, తాడూరు పేరును తాండూరుగా, చేర్యాల నుంచి చుంచనకోటకు వెళ్లే మార్గంలో చుంచంకోటగా, మద్దూరు మండలంలోని నర్సాయపల్లికి వెళ్లే రోడ్డులో జాతీయ రహదారి పైనే బోర్డు ఏర్పాటు చేశారు.
నర్సాయపల్లికి బదులుగా నరసైపల్లి అని నేమ్ బోర్డులు వేశారు. కొన్ని రోజులుగా తప్పుల తడకలుగా ఉన్న బోర్డులను చూసి ప్రజలు పెదవి విరుస్తున్నారు. అసలు గ్రామాలకు సమీపంలో బోర్డులు ఏర్పాటు చేయకుండా కొన్ని బోర్డులను ఎక్కడ పడితే అక్కడ వేశారు. కొత్తవారు ఇబ్బందులకు గురవుతున్నారు. బోర్డులను వెంటనే సరిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.