జహీరాబాద్, ఏప్రిల్ 21: నిమ్జ్ ప్రాజెక్టులో భూములను కోల్పోతున్న బాధిత రైతులు, తండావాసులకు అధికారులు కేటాయిస్తామన్న (భూమి) స్థలాన్ని చూపిన తర్వాతే భూములు స్వాధీనం చేసుకుని ఇతర పనులు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ముంగి గిరిజన తండావాసులు స్పష్టం చేశారు. మంగళవారం సంబంధిత అధికారులు, ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ అధికారులు, సిబ్బంది తండాకు చేరుకున్నారు. భూములు స్వాధీనం చేసుకునేందుకు కడీలు పాతి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతుండగా తండాకు చెందిన బాధిత రైతులు, తండావాసులు అడ్డుకున్నారు.
నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు కోల్పోవడంతో తండావాసుల కోసం కేటాయిస్తామన్న దాదా పు 30 ఎకరాలకు పైగానే స్థలాలు చూపిన తర్వాతే పనులు చేపట్టాలని, అప్పటి వరకు తండా పరిసరాల్లో ఎలాంటి పనులు చేపట్టరాదన్నారు. తండాపరిసరాల్లోని తమ భూ ములు స్వాధీనం చేసుకుని, కడీలు పాతి, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే ఎలా రాకపోకలు సాగించాలంటూ సంబంధిత అధికారులను నిలదీశారు. తండాకు కేటాయిస్తామన్న స్థలాన్ని లిఖిత పూర్వకంగా చూపించే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని తండావాసులు అడ్డుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే మండల తహసీల్దార్ ప్రభులు, ఆర్ఐ శ్యామ్‌రావు, జహీరాబాద్ రూర ల్ సీఐ జక్కుల హనుమంతు, హద్నూర్ ఎస్సై దోమ సుజీత్ సిబ్బందితో తండాకు చేరుకున్నారు. తండాకు చెందిన బాధిత రైతులు, గిరిజనులతో సంబంధిత అధికారులు మాట్లాడారు. తండాకు కేటాయిస్తామన్న (భూ మి) స్థలం విషయమై అధికారులు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూ ములు స్వాధీనం, కడీలు పాతి, ఫెన్సింగ్ పనులు అడ్డుకోవద్దని అధికారులు తండావాసులకు సూచించారు. తండాకు కేటాయిస్తామన్న(భూమి) స్థలాన్ని సర్వేయర్‌తో సర్వే చేయిస్తామని తహసీల్దార్ ప్రభులు హామీ ఇవ్వడంతో తండావాసులు శాంతించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య భూముల స్వాధీనం, కడీలు పాతి, ఫెన్సింగ్ ఏర్పాటు, మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగాయి.