మెదక్ మున్సిపాలిటీ, జూలై 4: నిరుపేదల సొంతింటి కలను నేరవేర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నది. కానీ ఇప్పుడు సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందుకోసం ‘గృహలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జూన్ 21న విడుదల చేసింది. ఇందులోభాగంగా సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి రూ. 3లక్షల ఆర్థిసాయం అందించనుంది. ఈ సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు 6వేల ఇండ్లు రానున్నాయి. దీంతో నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరగనుంది. ఇందుకోసం లబ్ధిదారులు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది.
బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, రూప్లెవల్ పూర్తయ్యాక రూ. లక్ష, నిర్మాణం మొత్తం పూర్తయ్యాక మిగిలిన రూ. లక్షను ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించనుంది. మంజూరు చేసిన ఇండ్లు మొత్తం మహిళల పేరుపైనే మంజూరు చేస్తారు. లబ్ధిదారులు సొంత డిజైన్ ప్రకారం ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఆమోదించిన ‘గృహలక్ష్మి’ పథకం లోగోను ఇంటిపై వేస్తారు. లబ్ధిదారులు కచ్చితంగా ఆహార భద్రత కార్డుతో పాటు సొంత స్థలం కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యముంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలు, మైనార్టీలకు 50శాతం తగ్గకుండా ప్రాధాన్యముంటుంది. దరఖాస్తుదారులు గానీ కుటుంబసభ్యులు గానీ ఇదివరకు లబ్ధిపొంది ఉంటే ఈ పథకానికి అనర్హులు.
పథకానికి అర్హతలు ఇవే..
నిరుపేదలకు అండగా గృహలక్ష్మి
గూడులేని నిరుపేదలకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకంతో అండగా నిలుస్తున్నది. పేదలకు ఈ పథకం ఒక వరం. ఎంతోమంది నిరుపేదలు స్థలం ఉండి ఆర్థిక స్తోమత లేక గుడిసెల్లో నివసిస్తుండ్రు. రూ.3 లక్షల సాయంతో పేదలకు ఎంతో మేలు కలుగనుంది. ప్రభుత్వం మహిళ పేరుపై ఇవ్వడం ఆనందంగా ఉంది. మహిళలకు అన్ని విధాలా అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
-సాధిక్, మెదక్
ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం..
సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ప్రభుత్వం రూ. 3లక్షలు ఇవ్వడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఎంతోమంది నిరుపేదలకు న్యాయం జరుగుతుంది. ‘గృహలక్ష్మి’ పథకం పూర్తిగా మహిళ పేరుపై ఇవ్వడం చాలా బాగుంది. సీఎం కేసీఆర్ సార్ ఎంతోమంది నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్నారు.
-పాలిన్ రత్నకిరణ్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు