సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ పుల్కల్, జూలై 16 : సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వానకాలం రైతులకు కలిసి రావటం లేదు. వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయిలో పడిపోతుండటం రైతులను మరింత కలవరపెడుతున్నది. జిల్లాలోని సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళకర స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. నల్లవాగు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరు కుంటున్నది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామ ర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 13.565 టీఎంసీల జలాలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జలాలతో తాగునీటి అవసరాలు మా త్రమే తీరుతాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేసే అవకాశాలు లేవు. కొద్దిరోజులుగా సింగూరు ప్రాజెక్టు కింద ఉన్న రైతులు సాగునీరు విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రాజెక్టు నిండితే తప్ప సాగునీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని చెరువులు, కుంటలు సైతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గతేడాది వానకాలంలో నీటితో కళకళలాడిన ప్రాజెక్టలు, చెరువులు, కుంటలు ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తుండంతో రైతులు కలవరపడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో కొద్దిరోజులుగా వర్షా లు కురవడం లేదు. జూన్‌లో సంగారెడ్డి జిల్లాలో మొత్తం 13.9 సెం.మీటర్ల సాధారణ వర్షం కురవగా, జూలైలో ఇప్పటివరకు 6.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు 9.1 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 6.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. 27శాతం తక్కువ వర్షపాతం నెలకొంది. దీంతో జిల్లాలో వానకాలం పంటల సాగు ఆశాజనకంగా సాగడం లేదు.
సంగారెడ్డి జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు అయిన సింగూరులో జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రాజెక్టులో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే సింగూరు జలాలు వాడే పరిస్థితి ఉంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో సగం జలాలు అంటే 13.565 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. సింగూర ప్రాజెక్టు కింద 40వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. పుల్కల్, చౌటకూరు, అందోలు మండలాల్లోని రైతులు కాల్వ లు, చెరువుల కింద వరి సాగు కోసం నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. వర్షాభావం కారణంగా చెరువుల్లో నీళ్లులేవు. వర్షాలు లేకపోవడంతో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. దీంతో ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతు లు సింగూరు నుంచి కాల్వల ద్వారా సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టులో కేవలం 13 టీఎంసీల జలాలు ఉన్నందున కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రాజెక్టులో కనీసం నీటిమట్టం 16 టీఎంసీలకుపైగా చేరుకుంటేనే సాగునీటిని విడుదల చేసే అంశాన్ని నీటిపారుదల శాఖ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగు ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ కి చేరుకుంటున్నది. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు కింద 6వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్నది. నల్లవాగు ప్రాజెక్టు కింద ఉన్న రైతులు వరి సాగు చేసేందుకు నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నల్లవాగు ప్రాజెక్టులో నీటిమట్టాలు ఆందోళకర స్థాయిలో పడిపోయాయి. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1493 ఫీట్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1479 ఫీట్ల జలాలు ఉన్నాయి. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ లెవల్ 1475 ఫీట్లు. మరో నాలుగు ఫీట్లు జలాలు తగ్గితే నల్లవాగు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ చేరుకోనుంది. ఇదే జరిగితే ప్రాజెక్టు కింద వరి సాగుకు సిద్ధమైన రైతులకు సాగునీటి ఆశలు ఆవిరికానున్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలు నీళ్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో 1769 చెరువులు ఉండగా, నాలుగు చెరువులు మాత్రమే నిండు గా ఉన్నాయంటే జల వనరుల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. 1425 చెరువుల్లో 25శాతం నీళ్లు మాత్రమే ఉన్నాయి. 300 చెరువుల్లో 50శాతంలోపు నీళ్లు ఉన్నాయి. 40 చెరువుల్లో మాత్రమే 50 నుంచి 75శాతం నీళ్లు ఉన్నాయి. నాలుగు చెరువులు నిండుగా ఉండగా వానకాలంలో ఒక్క చెరువు అలుగు పారకపోవటం గమనార్హం. దీంతో రైతులు ఎలాంటి కాలం వచ్చిందని మదనపడుతున్నారు.
సింగూరు కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. ఆశించినంతగా వర్షాలు పడడం లేదు. పంటలు వేసేదెట్లా. వేసిన తుకాలు ఎండిపోతున్నాయి. తొందరగా నీటిని విడుదల చేస్తేనే నార్లను బతికించుకుంటాం. నాట్లు వేసుకుంటాం. లేదంటే మా బతుకులు ఆగమైతయి. కాంగ్రెసోళ్లు రైతులను కనికరించి నీటిని విడుదల చేయాలి.
బోరుబావుల వద్ద వేసిన పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. సక్రమంగా నీళ్లందక నారుమడులు ఎండిపోతున్నాయి. కెనాల్ నీటిని విడుదల చేస్తేనే పంటలు పండుతాయి. సింగూరు కెనాల్‌ను నమ్ముకొని రైతులందరూ నార్లు పోసుకున్నారు. ఇప్పటివరకు రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేసేలా చొరవ చూపించాలి.
రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే సింగూరు కాల్వల ద్వారా నీటిని విడుదల చేయాలి. ఈ ప్రాంతానికి చెందిన దామోదర రాజనర్సింహ మంత్రిగా ఉన్నా నీటి విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదు. రైతుల బాధలు మంత్రికి పట్టవా. వెంటనే సింగూరు కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.