పల్లెలు, పట్నాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక హరిత తెలంగాణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా ఎనిమిది విడతలు పూర్తి చేసుకున్నది. త్వరలో తొమ్మిదో విడతను ప్రారంభించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది విడతల్లో 8,77 కోట్ల మొక్కలు నాటగా, అటవీ విస్తీర్ణం 3.5 శాతం మేర పెరిగింది. 9వ విడతలో 40,76,500 మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్, మనోహరాబాద్, పరికిబండ, వడియారంలో నాలుగు అర్బన్ పార్కులు, పాతూర్లో హరిత నిధి నర్సరీని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 5.95కోట్ల మొక్కలు నాటారు. రాబోయే విడతలో 34.93 లక్షలు నాటాలని టార్గెట్గా పెట్టుకున్నారు.
మెదక్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు బోసిపోయాయి. ఎక్కడ చూసినా చెట్లు కనిపించకపోవడంతో తలదాచుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రం పచ్చగా ఉండాలని హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడ గజం స్థలం కనబడినా ఆ ప్రాంతంలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మొక్కలు నాటుతున్నారు. దీంతో పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పడు పట్టణాలకు రావాలంటే ప్రజలు ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో నుంచే పచ్చదనం దర్శనమిస్తోంది. రహదారులకు మధ్యలో డివైండర్లు ఏర్పాటు చేసి మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి మానవుని విద్యుక్త ధర్మంగా భావించే సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు. తెలంగాణకు హరితహారం స్థాయిలో మరే రాష్ట్రంలోనూ మొక్కలు నాటి, కాపాడే కార్యక్రమం అమలు కావడం లేదంటే అతిశయోక్తి లేదు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొంటున్నారు. మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు తమ వార్షిక బడ్జెట్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్న నిబంధనను నూతన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల్లో ప్రభుత్వం పొందుపర్చింది. స్థానిక సంస్థల కృషితో మెదక్ జిల్లాలోని ప్రతి పట్టణం, గ్రామం పచ్చదనంతో పరిఢవిల్లుతున్నది. ఫారరెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ఇండియా ఫారెస్ట్ రిపోర్టు 2021 ప్రకారం తెలంగాణలో మొత్తం గ్రీన్ కవర్ 7.70 శాతం పెరిగింది. ఇది 5.13 లక్షల ఎకరాలకు సమానం. 9వ విడత హరితహరం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా 34 లక్షల 93 వేల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ప్రధానంగా రహదారుల వెంట మల్టివెలవ్ ప్లాంటేషన్ చేయాలని, నీటి పారుదల శాఖ కింద ఉన్న చెరువులు, కట్టలు, నదులు, కాలువల వెంట 528 కిలోమీటర్ల మేర 765 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. క్షీణించిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో ఇప్పటి వరకు 21.33 లక్షల మొక్కలు 14,627 హెక్టార్ల అటవీ భూముల పునరుద్ధరణ జరిగింది.
హరితహారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున మొకలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. గ్రామ గ్రామాన నర్సరీల ద్వారా మొకలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి మెదక్ జిల్లాలో 34.93 లక్షల మొకలు నాటే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. జిల్లాలో తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మొకలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించనున్నారు. ఈ మేరకు ప్రజలు అడిగిన మొకలను అందజేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇళ్లలో ప్రధానంగా పెంచే గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్లనేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొకలతోపాటు పలు ఔషధ, పూల మొకలను సిద్ధం చేస్తున్నారు. పలు మొకలను ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్యశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో నాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో మరింత ఆహ్లాదాన్ని పెంచేలా పలు పూల, పండ్ల మొకలను నాటేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అన్ని శాఖలకు లక్ష్యాలను కేటాయించి 100 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు, పల్లెలు, పట్టణాలు ఇలా పలు ప్రాంతాల్లో మొకలు నాటనున్నారు. నాటిన వాటిల్లో కనీసం 85 శాతం మొకలు బతికేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మొకలు బతికించే బాధ్యతను ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, పంచాయతీ అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లకు అప్పగించారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో చనిపోయిన మొకలను తొలగించి వాటి స్థానాల్లో మళ్లీ ఇతర మొకలు నాటాలని ఆదేశించారు.
మెదక్ జిల్లాలో ఇప్పటికే నర్సాపూర్ అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కు ఉండగా, కొత్తగా హెచ్ఎండీఏ పరిధిలో మరో మూడు ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారి శివారులో గ్రామీణ ప్రాంతవాసులకు పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే ఉద్దేశంతో హెచ్ఎండీఏ పరిధిలోని వడియారం, మనోహరాబాద్, పరికిబండ ప్రాంతాల్లో ఈ అర్బన్ పార్కులను నిర్మిస్తున్నారు. ఒక్కో పార్కులో 2 లక్షల పై చిలుకు మొక్కలు నాటుతున్నారు. వడియారం అర్బన్ పార్కులో 3.60 లక్షల మొక్కలు, మనోహరాబాద్లో లక్ష, పరికిబండలో 2.50 లక్షల మొక్కలు నాటారు. వడియారంలో 528 హెక్టార్లలో, పరికిబండలో 880 హెక్టార్లలో, మనోహరాబాద్లో 129 హెక్టార్లలో ఆహ్లాదకరమైన అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేశారు. ఈ పార్కుల్లో వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ట్రాక్లతోపాటు క్యాంపింగ్ ఫెసిలిటీ, సాహస క్రీడలు, గజీబో తదితర సదుపాయాలు కల్పించారు.
మెదక్ జిల్లాలో 2,75,737 హెక్టార్ల విస్తీర్ణంతో 21 రెవెన్యూ మండలాలతోపాటు అటవీ విస్తీర్ణం 17 మండలాల్లో విస్తరించి ఉంది. మొత్తం విస్తీర్ణం 57627.424 హెక్టార్ల అటవీతో 21.10 శాతం భౌగోళిక విస్తీర్ణం కలిగి ఉన్న మెదక్ జిల్లా హరితహారంలో భాగంగా 5 లక్షల వరకు మొక్కలు నాటడం జరిగింది. మొక్కలను పెంచడానికి 15,500 నర్సరీలను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 19 అటవీ శాఖ నర్సరీలతోపాటు గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో 469, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 5 నర్సరీలను ఏర్పాటు చేసి మొత్తం జిల్లాలో 493 నర్సరీలను ఏర్పాటు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 76,16,227, అటవీ శాఖ ద్వారా 25,00,000, మున్సిపల్ శాఖ ద్వారా 3,20,000 మొక్కలను మొత్తం 1,04,36,227 మొక్కలను నర్సరీలో పెంచడం జరుగుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత మెదక్ జిల్లాలో నర్సాపూర్, మనోహరాబాద్, పరికిబండ, వడియారంలో నాలుగు అర్బన్ పార్కులను ఏర్పాటుచేశారు. మెదక్ జిల్లా పాతూర్లో హరిత నిధి నర్సరీని ఏర్పాటు చేసి జిల్లాలో పోచారం అభయారణ్యంలో ఈఈసీ ఫారెస్ ప్లస్ సహకారంతో ఏర్పాటు చేశారు.